Dec 08,2022 06:33

డిసెంబర్‌ 5న కర్నూలులో జరిగిన 'రాయలసీమ గర్జన'ను పేరుకి జాయింట్‌ యాక్షన్‌ కమిటి నిర్వహించినా, ఆచరణలో అది అధికారపార్టీ సభగా నడిచింది. కర్నూలులో హైకోర్టు పెట్టి న్యాయ రాజధాని చేసి గత వైభవాన్ని తెద్దామనుకుంటుంటేే దుష్టశక్తులు అడ్డు కుంటున్నాయని విమర్శించడంతో పాటు, ఎన్ని అడ్డంకులు వచ్చినా న్యాయ రాజధాని నిర్మించి తీరతామని ఇద్దరు సీనియర్‌ మంత్రులు బల్లగుద్ది మరీ చెప్పారు. జగన్నాథగుట్ట మీద నిర్మించే హైకోర్టు కర్నూలు నలుదిక్కుల పది కిలోమీటర్ల దూరం నుండి ఎటు చూసినా అందరికీ కనిపించేలా కట్టబోతున్నామని ఆర్థికమంత్రి భరోసా ఇచ్చారు. పనిలో పనిగా రాయలసీమకు తెలుగుదేశం హయాంలో జరిగిన అన్యాయాల గురించి విమర్శలు గుప్పించారు. ఈ సభకు రెండు వారాల ముందు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కర్నూలు జిల్లాలో పర్యటించి తన పాలనలో రాయలసీమకు చేసిన మేలు గురించి చెప్పుకుని, వైసిపి ప్రభుత్వం చేసిన మోసాల గురించి విమర్శలు చేశారు. రెండు పార్టీల విమర్శలను, స్వోత్కర్షలను ఎవరికి అనుకూలంగా వున్న పత్రికలు వారి శక్తి వంచన లేకుండా ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం చేశాయి. ఈ రెండు పార్టీల కంటె ముందు ఈ సంవత్సరం మార్చి 18న కడపలో 'రాయలసీమ రణభేరి' నిర్వహించిన బిజెపి వారు...ఈ ప్రాంత వెనుకబాటు, రాష్ట్రంలోని రెండు పార్టీలు చేసిన ద్రోహం గురించి ఏకరువు పెట్టడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి వుందని చెప్పారు. ఈ పార్టీలన్నింటికీ రాయలసీమ మీద ఒకేసారి ఇంత ప్రేమ పుట్టడానికి, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం గురించి, ఇక్కడి సమస్యల గురించి మాట్లాడడానికి అసలు కారణం రానున్న ఎన్నికలన్నది జనమెరిగిన సత్యం. అందరూ రాయలసీమను అభివృద్ధి చేసి వుంటే ఎందుకింత వెనుకబడి వుంది?

  • ఎందుకీ వెనుకబాటు?

ఏ ప్రాంతమైనా అభివృద్ధి కావాలంటే వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగంతో పాటు విద్యా వైద్యం, మౌలిక వసతులు అభివృద్ధి కావాలి. రాయల కాలంలో ఇక్కడ రతనాలు రాశులు పోసి అమ్మారో లేదో కాని నేడు మాత్రం అన్ని రంగాల్లో రాయలసీమ వెనుకబడింది. అక్షరాస్యత, వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల్లో అట్టడుగు స్థానాల నుండి మొదటి ర్యాంకుల్లో ఈ ప్రాంత జిల్లాలు వున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన నాటికి వున్న 13 జిల్లాల్లో అత్యంత వెనుకబడిన వాటిలో రాయలసీమ లోని నాలుగు జిల్లాలు వరుసగా కడప జిల్లా 7వ స్థానంలో, చిత్తూరు 9వ స్థానంలో, కర్నూలు 10వ స్థానంలో, అనంతపురం జిల్లా 11వ స్థానంలో వున్నాయి. ఈ వెనుకబాటుకు ప్రధాన కారణాలు వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి లేకపోవడం. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి అయిన తర్వాత కూడా అనంతపురం జిల్లాలో 85.39 శాతం, కర్నూలు జిల్లాలో 72.31 శాతం వ్యవసాయ భూమి వర్షంపై ఆధారపడి వుంది. మిగిలిన రెండు జిల్లాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.
ఇన్నేళ్ళ తర్వాత కూడా ఈ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో వెయ్యి మంది పని చేసే ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమ లేదు. గతంలో వున్న చిన్నపాటి పరిశ్రమలు అనేకం మూతబడ్డాయి. తాడిపత్రిలో ఎన్‌టిసి (నేషనల్‌ టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌), ముద్దనూరులో ఆర్‌టిపిపి, పెనుగొండలో ఆల్విన్‌ వాచ్‌ కంపెనీ, గుంతకల్లులో రైల్వే లోకో షెడ్‌, హిందూపురంలో నిజాం షుగర్‌ ప్యాక్టరీ, గుంతకల్లులో స్పిన్నింగ్‌ మిల్లు, కర్నూలులో వేలాది మందికి ఉపాధి చూపిన రాయలసీమ పేపర్‌ మిల్లు, కార్బైడ్‌ ఫ్యాక్టరీ ఇలా ఒకటేమిటి అనేక పరశ్రమలు మూతబడ్డాయి. కొత్త పరిశ్రమల స్థాపన కోసం చేసిన శంకుస్థాపనల శిలాఫలకాలు పాలకుల నిర్లక్ష్యానికి దిష్టిబొమ్మలుగా వున్నాయి. కడప జిల్లాలో సెయిల్‌ ఆధ్వర్యంలో భారీ ఉక్కు పరిశ్రమ, కర్నూలులో రైల్వే కోచ్‌ల నిర్మాణం, చిత్తూరు జిల్లాలో కండలేరు ప్రాజెక్టు నిర్మాణం, అనంతపురం జిల్లాలో ఖుద్రేముఖ్‌ ఉక్కు పరిశ్రమ లాంటి హామీలన్నీ ఈ ప్రాంతంలోని కార్పొరేట్‌ కంపెనీల గాలిమరల ధాటికి మాయమయ్యాయి.
చిత్తూరు జిల్లాలో చిత్తూరు-మద్రాసు ఐ.టి కారిడార్‌, అనంతపురం జిల్లాలో బెంగుళూరు కారిడార్‌, హర్డ్‌వేర్‌ పరిశ్రమలు, లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ ఇలా ఎన్నికలు వచ్చినప్పుడుల్లా రకరకాల హామీలు ఇచ్చారు. ఒక్కటంటే ఒక్కటి అమలు చేసిన పాపాన పోలేదు. పెనుకొండ దగ్గర వచ్చిన కియా పరిశ్రమ గురించి పాత, కొత్త పాలకులు జబ్బలు చరుచుకుంటున్నారు. కాని అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో ఈ పరిశ్రమ కోసం భూములు కోల్పోయిన వారిలో ఒక్క శాతం కూడా లేరని, మొత్తం రాయలసీమ జిల్లాలకు చెందిన కార్మికులు పది శాతం లోపేనన్న వాస్తవాన్ని కావాలనే మరుగున పరుస్తున్నారు.

  • అటకెక్కిన వివిధ కమిటీల నివేదికలు

రాయలసీమ వెనుకబాటుపై ప్రభుత్వాలు అనేక కమిటీలు వేశాయి. ఆ కమిటీలు నివేదికలు ఇచ్చాయి. ఇక్కడి సాగు భూమి సారవంతమైనదని రకరకాల పంటలకు ముఖ్యంగా నాణ్యమైన పండ్ల తోటలకు అనువైన ప్రాంతమని ప్రకటించాయి. అయితే నికరమైన సాగునీటి వనరులు కల్పించడమే అత్యంత ప్రాధాన్యతగా ప్రభుత్వాలు భావించాలని ఈ కమిటీలు చెప్పాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నాడు నిర్మించిన తుంగభద్ర హెచ్‌ఎల్‌సి, ఎల్‌ఎల్‌సి, ఆ తర్వాత కె.సి కెనాల్‌, తెలుగుగంగ, హంద్రీ నీవా...ఇవన్నీ డ్యామ్‌లు కాదు, కాల్వలు. ఇవే ఈ ప్రాంత వ్యవసాయానికి దిక్కు. ఈ కాల్వల నీరు కూడా క్రమంగా సాగునీటి నుండి తప్పుకొని తాగునీటి అవసరాలకు ఉపయోగించే పరిస్థితి దాపురించింది. రాయలసీమ జిల్లాల్లో 64 రకాల ఖనిజ సంపద ఉన్నట్టుగా శాస్త్రీయ సర్వేలు చెబుతున్నాయి. ఇనుము, బైరైట్లు, స్టైలైట్‌, ఆస్బెస్టాస్‌, రాగి, వజ్రాలు, కాల్‌సైట్‌, బంగారం, డోలమైట్‌...వంటి ఖనిజ సంపదకు కొదవలేదు. కడప, చిత్తూరు జిల్లాల్లో లభించే పులరిన్‌ ప్రపంచం లోనే అత్యంత అరుదైన ఖనిజం. దీని ధర బంగారం కన్నా 150 రెట్లు అధికం అంటారు. నల్లమల అడవుల్లో దొరుకుతున్న అత్యంత విలువైన ఎరచ్రందనం, శ్రీగంధం, శేషాచలం కొండల్లోను, కదిరి, కుప్పం గుట్టలలోనూ అపారమైన ఖనిజ సంపద రాయలసీమలో వుంది. అత్యంత విలువైన ఔషధ మొక్కలు వున్నాయి. వీటన్నింటిని పరిశీలించిన శ్రీకృష్ణ కమిషన్‌, ప్రొ||స్వామినాథన్‌ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం, ప్రొ|| జయతి ఘోష్‌ కమిషన్‌, అనంతపురం జిల్లా అభివృద్ధికి అయ్యప్పన్‌ కమిషన్‌ అనేక విలువైన సూచనలు చేశాయి. ఎన్ని అవకాశాలు వున్నా, ఎన్ని కమిటీలు సూచించినా అమలు చేసే పాలకులకు చిత్తశుద్ధి లేకపోతే ఎన్ని వున్నా... ఏం ఉపయోగం అన్నట్లుగా తయారైంది పరిస్థితి.

  • ఎండమావులవుతున్న పాలకుల హామీలు

తెలుగుదేశం అధికారంలో వున్నప్పుడు నాటి ముఖ్యమంత్రి నవ్యాంధ్ర సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రకటించారు. అందులో రాయలసీమ నాలుగు జిల్లాల అభివృద్ధికి అనేక పథకాలు ప్రకటించారు. వాటిలో కొన్ని... అనంతపురం జిల్లాకు 100 శాతం సబ్సిడీతో డ్రిప్‌, స్పింక్లర్లు, ఎయిమ్స్‌కు అనుబంధ కేంద్రం, స్మార్ట్‌ సిటీ, టైక్స్‌టైల్‌ పార్క్‌, ఎలక్ట్రానిక్‌ మరియు హార్డ్‌వేర్‌ క్లస్టర్‌, విమానాల నిర్వహణ, మరమ్మతుల పరిశ్రమ, కర్నూలుకు నూతన విమానాశ్రయం, ఓర్వకల్లు వద్ద పారిశ్రామిక నగరం, హైదరాబాద్‌- బెంగుళూరు పారిశ్రామిక కారిడార్‌, టైక్స్‌టైల్‌ క్లస్టర్‌, న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌, స్విమ్స్‌ తరహా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, రైల్వే వాగిన్‌ల కర్మాగారం, చిత్తూరు జిల్లా కుప్పంలో ఎయిర్‌పోర్ట్‌, తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఐఐటీ, హార్టీకల్చర్‌ జోన్‌, మెగా ఫుడ్‌ పార్క్‌, ఐ.టి హబ్‌గా తిరుపతి, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ, సిమెంట్‌ పరిశ్రమలు, ఉర్దూ యూనివర్శిటీ, గార్మెంట్‌ క్లస్టర్‌... ఇవన్నీ అమలు చేసి వుంటే లేదా చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ప్రయత్నించి వుంటే ఈ రోజు రాయలసీమ వెనుకబాటు గురించి గుండెలు బాదుకోవలసిన అవసరం వుండేది కాదు.
తెలుగుదేశం ఇచ్చిన హామీలు సక్రమంగా అమలు చేయకపోవడంతో పాటు, వైసిపి ప్రభుత్వం తమను ఆదుకుంటుందనే ఆశతో రాయలసీమ ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా వైసిపి ని దాదాపు ఏకపక్షంగా గెలిపించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల అమలు షరా మాములైంది. గతంలో సబ్సిడీ ద్వారా రైతులకు అందిన డ్రిప్‌, స్పింక్లర్లను నిలిపివేసింది. హంద్రీ నీవా రెండు దశలతో పాటు, డిస్ట్రిబ్యూటరీ కాల్వలు తవ్వి నికర సాగునీటి సదుపాయం కల్పిస్తామనే హామీ కనీస అమలుకు నోచుకోకపోగా ఈ నీటి కోసం వాడుతున్న విద్యుత్‌ బిల్లుల బకాయిలు, నిర్వహణకు నిధులు సక్రమంగా చెల్లిండంలేదు. తానే శంకుస్థాపన చేసిన కడప ఉక్కు పరిశ్రమ అతీగతీ లేకుండా పోయింది. తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు లేవు. కొత్త పరిశ్రమలు లేవు, యువతకు ఉపాధి లేదు. ఈ ప్రాంతంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా వుంది. ఉదా: కృష్ణదేవరాయ యూనివర్శిటీలో 32 డిపార్ట్‌మెంట్లు వుంటే ఎనిమిదింటిలో ఒక్క ప్రొఫెసర్‌ కూడా లేడు. మరో పదకొండింటిలో ఒక్కరు మాత్రమే వున్నారు. 'లా' విభాగంలో అధ్యాపకులు లేరని, ఆడ్మిషన్లు నిలిపివేస్తున్నామని యూనివర్శిటీ యాజమాన్యం ప్రకటించింది. ప్రభుత్వ వైద్యంలో మెరుగుదల లేదు. ఇవేవీ చేయకుండా అభివృద్ధి గురించి మాట్లాడి మరలా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. అధికార వికేంద్రీకరణ జరగాలి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. అది ఒక్కటే ఈ ప్రాంత అభివృద్ధికి సరిపోదు. ఇచ్చిన అన్ని హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలి.

  • ప్రజా పోరాటమే మార్గం

విభజన చట్టంలో భాగంగా ఈ ప్రాంతానికి నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయని కేంద్ర బిజెపి పాలకులను ప్రశ్నించాలి. 2015 సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో శంకుస్థాపన చేసిన బెల్‌, నాసెన్‌ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్రీయ విశ్వవిద్యాలయం, బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజి అమలు కోసం కేంద్ర పాలకులను నిలదీయకుండా రాయలసీమను ఎలా అభివృద్ధి చేస్తారు. ఎన్నికల ముందు రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడి సున్నితమైన అంశాలను ఎన్నికల ప్రయోజనాల కోసం రెచ్చగొట్టి మరో విభజన వాదానికి పునాదులు వేసే చర్యలను ప్రజలు చైతన్యంతో ఎదుర్కోవాలి. పాలకుల మోసాలను ప్రశ్నించాలి. ప్రజా పోరాటాల ద్వారా రాయలసీమ అభివృద్ధిని సాధించుకోవాలి.

 rambhupal

 

 

 

(వ్యాసకర్త : వి. రాంభూపాల్‌, సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యుడు)