న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మరోసారి వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గురువారం ప్రకటించారు. 2022 జూన్ నుండి వరుసగా ఆరు సార్లు రేట్ల పెంపుదల 250 బేసిన్ పాయింట్లకు చేరిన తర్వాత ఏప్రిల్ నుండి వడ్డీ రేట్ల పెంపుదలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. వడ్డీరేట్లను వరుసగా మూడోసారి యథాతథంగా కొనసాగించడం గమనార్హం. మంగళవారం ప్రారంభమైన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపిసి) సమావేశ నిర్ణయాలను ఆయన వెల్లడించారు. అయితే ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆర్‌బిఐ లక్షిత పరిధి 4 శాతం ఎగువనే ఉందని తెలిపారు. గత కొన్ని వారాలుగా టమాటో, గోధుమలు, బియ్యం వంటి కొన్ని ఆహార పదార్థాలపై వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (సిపిఐ) పెరుగుతుండటంతో .. ఎంపిసి సమావేశం జరిగింది. ఆర్థిక సంవత్సరం 2024 కోసం సిపిఐ ద్రవ్యోల్బణం అంచనా 5.4 శాతానికి సవరించబడింది. గతంలో ఈ అంచనాలు 5.1 శాతంగా ఉంది.










