ప్రజాశక్తి-రాయదుర్గం : నైరుతి రైల్వే హుబ్బల్లి డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ హర్ష ఖరే శుక్రవారం రాయదుర్గం రైల్వే స్టేషన్ తనిఖీ చేశారు. హుబ్లీ నుండి ప్రత్యేక రైలులో వచ్చిన ఆయన నేరుగా కదిరి దేవరపల్లి వెళ్లి అక్కడి రైల్వే స్టేషన్, తిరుపతి రైలు సేవల నిర్వహణ తనిఖీ చేశారు. అనంతరం తిరుగు ప్రయాణంలో కళ్యాణదుర్గం, ఆవులదట్ల రైల్వే స్టేషన్లో తనిఖీ చేశారు. రాయదుర్గం రైల్వే జంక్షన్ లో కొత్తగా నిర్మించిన స్టేషన్ భవనాలను, పాత స్టేషన్లో గల సిగ్నలింగ్ వ్యవస్థ, రైలు సర్వీసుల నిర్వహణ గురించి తనిఖీ చేశారు. అనంతరం స్థానికులు అందజేసిన వినతిపత్రం అందుకున్నారు. రాయదుర్గం రైల్వే స్టేషన్ లో ఎక్స్ప్రెస్ రైలు ఆపాలని, కొత్త స్టేషన్ భవనాలను వెంటనే ప్రారంభించాలని, స్టేషన్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.










