Sep 08,2020 08:15


మన రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం రాష్ట్రంలో పరోక్ష పన్నులను విధించే అధికారం రాష్ట్రాలదే. కాని జిఎస్‌టిని ప్రవేశ పెట్టినప్పుడు ఆ అధికారాన్ని రాష్ట్రాలు ఒదులుకున్నాయి. జిఎస్‌టి వలన రాష్ట్రాలు రానున్న ఐదేళ్ళ కాలంలో ఎంతైతే రెవెన్యూను కోల్పోతాయో ఆ మేరకు కేంద్రం భర్తీ చేస్తుందన్న తిరుగు లేని హామీని పొందిన తర్వాతనే రాష్ట్రాలు జిఎస్‌టి వ్యవస్థను ఆమోదించాయి. వృద్థిరేటు 14 శాతం ఉంటే రాష్ట్రానికి పాత విధానంలో ఎంత ఆదాయం పరోక్ష పన్నుల రూపంలో సమకూరి వుండేదో లెక్క కట్టి, ఇప్పుడు జిఎస్‌టి విధానంలో దానికన్నా ఎంత తగ్గిందో తేల్చి ఆ మొత్తాన్ని కేంద్రం రాష్ట్రానికి నష్టపరిహారంగా చెల్లించాలి. ఈ హామీకి ''జిఎస్‌టి (రాష్ట్రాలకు నష్ట పరిహారం) చట్టం, 2017'' రూపంలో పార్లమెంటు చట్టబద్ధత కల్పించింది.
అయితే జిఎస్‌టి వ్యవస్థ ద్వారా ఆశించినంత రెవెన్యూ రాలేదు. ఆ విధానంలోనే నిబిడీకృతమైవున్న లోపాలు ఒక కారణం. జిడిపి వృద్ధిరేటు తగ్గిపోవడం రెండో కారణం. రాష్ట్రాలకు జిఎస్‌టి నష్ట పరిహారం చెల్లించడం కోసం విధించిన జిఎస్‌టి సెస్‌ కూడా రాష్ట్రాలకు నష్ట పరిహారం చెల్లించడానికి సరిపోదు. రాష్ట్రాల రెవెన్యూ ఆదాయాలేమో మరోవైపున తగ్గిపోయాయి. అంటే కేంద్రం రాష్ట్రాలకు భర్తీ చేయవలసిన మొత్తమూ పెరిగింది, తక్షణమే చెల్లించాల్సిన అవసరమూ వచ్చిపడింది. కాని అలా చెల్లించడానికి కేంద్రానికి కూడా జిఎస్‌టి ఆదాయం తక్కువగానే వచ్చింది. ఇటువంటి సమయంలో ఆ కొరవను భర్తీ చేయడానికి కేంద్రం అప్పు చేయడమో, లేక సంపద పన్ను, వారసత్వ పన్ను వంటి కొత్త పన్నులను విధించడమో చేసి సేకరించాలి.
కాని కేంద్రం తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. జిఎస్‌టి నష్ట పరిహారాన్ని చెల్లించే బాధ్యత నుండి పక్కకు తప్పుకుంది. ఈ సమస్య 2019 ఆగస్టులోనే తలెత్తింది. అయితే, ఈ ఏడాది కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ మహమ్మారి జిఎస్‌టి ఆదాయాన్ని చాలా దెబ్బ తీసింది. దాంతో రాష్ట్రాల వాటా కూడా తగ్గింది. ఇంకోవైపు ఆ రాష్ట్రాలు కరోనాను ఎదుర్కోడానికి పెట్టవలసిన ఖర్చు బాగా పెరిగింది. 2020-21 కి గాను కేంద్రం పరిహారంగా రాష్ట్రాలకు చెల్లించవలసినది రూ.3 లక్షల కోట్లు. ఇందులో జిఎస్‌టి సెస్‌ ద్వారా సమకూరినది రూ.65 వేల కోట్లు. తక్కిన రూ.2.35 లక్షల కోట్లనూ రాష్ట్రాలకు చెల్లించడానికి కేంద్రం మొండిగా నిరాకరిస్తోంది. ఆగస్టు 27న జరిగిన జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్రాలను అప్పు చేసుకోమని చెప్పింది. రాష్ట్రాల ముందు రెండు ప్రతిపాదనలను పెట్టి ఏదో ఒకటి ఎంచుకోమని చెప్పింది. ఏది ఎంచుకున్నా అది రాష్ట్రాలను అప్పులపాలు చేసేదే.
ఈ వ్యవహారం రోత పుట్టిస్తోంది. కేంద్రం, తాను ఇచ్చిన తిరుగులేని (తప్పించుకోలేని) హామీని ఉల్లంఘించడమే గాక పార్లమెంటు చేసిన చట్టాన్ని కూడా బేఖాతరు చేస్తోంది. ఆ హామీ ఆధారంగానే రాష్ట్రాలు తమ రాజ్యాంగబద్ధమైన హక్కును ఒదులుకోడానికి, రాజ్యాంగ సవరణకు ఆమోదించాయి. ఆ తర్వాతే జిఎస్‌టి చట్టం చేయడం సాధ్యపడింది. ఈ క్రమంలో రూపొందిన కొత్త రాజ్యాంగ ఏర్పాటును కేంద్రం ఉల్లంఘిస్తోంది. అంతేగాక, కేంద్రం తీసుకున్న ఈ వైఖరిని సమర్ధించుకోడానికి చెప్తున్న వాదనలో ఇసుమంతైనా ఆర్థిక తర్కం లేదు.
తాను అప్పు చేయడం వలన ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందని కేంద్రం వాదిస్తోంది. మరి రాష్ట్రాలు అప్పులు చేస్తే హాని జరగదా? నిజానికి రూ.2.35 లక్షల కోట్ల మేరకు రాష్ట్రాలు అప్పులు చేయవచ్చునంటూ చెప్పడం ద్వారా కేంద్రమే అప్పు చేయడం అవసరం అని అంగీకరించినట్టైంది. అలా చేసిన అప్పు సొమ్మును తిరిగి ఆర్థిక వ్యవస్థ లోకి ''ప్రభుత్వ అదనపు ఖర్చు'' ద్వారా పంపించవచ్చునని ఒప్పుకుంది. అటువంటప్పుడు కేంద్రమే ఆ అప్పు చేసి రాష్ట్రాలకు జిఎస్‌టి పరిహారంగా చెల్లిస్తే సరిపోతుందికదా? అలా చేయడం ద్వారా అటు కేంద్రం తన వంతుగా రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతను, పార్లమెంటు చట్టాన్ని గౌరవించినట్టు అవుతుంది. పైగా కేంద్రం పరిధిలో రకరకాల పన్నులు విధించే విస్తృత అధికారాలు ఉన్నందున తాను చేసిన అప్పును ఎగగొట్టి బకాయిపడే పరిస్థితీ ఉత్పన్నం కాదు. ఒకవిధంగా చెప్పాలంటే, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు చేయడానికి లేని అవకాశాలు, స్వేచ్ఛ కేంద్రానికి ఉన్నాయి. తన ఇష్టం వచ్చినట్టు కేంద్రం అప్పు చేయవచ్చు.
తన ప్రతిపాదనను సమర్ధించుకోడానికి కేంద్రం రెండు వాదనలు చేస్తోంది. ఈ రెండూ పసలేనివే. మొదటిది- జిఎస్‌టి ఆదాయం ఇంత తీవ్రంగా తగ్గిపోవడానికి కారణం కరోనా మహమ్మారి. అది ఒక ''దైవ నిర్ణయం'' (యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌) అందుచేత ఈ పరిస్థితికి కేంద్రం బాధ్యత వహించజాలదు. ''దైవ నిర్ణయం'' వంటి కారణాలతో ఒక ఒప్పందంలో తన వంతు బాధ్యత నుండి తప్పుకోడానికి ప్రైవేటు ఒప్పందాలలో అవకాశం ఉంది. ఆ ప్రైవేటు ఒప్పందాలన్నీ పెట్టుబడిదారీ మూసలో, తన లాభాలు గరిష్టంగా ఉండేలా చూసుకునే జాగ్రత్తల్లో భాగంగా ఇటువంటి షరతులు పెడతాయి (కస్టమర్లకు ఇచ్చే గ్యారంటీ కార్డుల మీద ఆ గ్యారంటీ ఏయే సందర్భాల్లో మాత్రమే వర్తిస్తుందో పేర్కొంటారు.). కాని రెండు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల మధ్య అటువంటి షరతులు వర్తించవు. నిర్మలా సీతారామన్‌ ''దైవ నిర్ణయం'' క్లాజును ప్రస్తావించడం ద్వారా ప్రజలు ఎన్నుకున్న రెండు ప్రభుత్వాల నడుమ కుదిరిన ఒప్పందాన్ని ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య చేసుకునే ఒప్పందం స్థాయికి దిగజార్చారు. ఇది రోత పుట్టిస్తోంది. నిత్యమూ ''సహకార ఫెడరలిజం'' గురించి మాట్లాడే ఈ ప్రభుత్వం నోటి వెంట ఈ మాటలు రావడం మరీ రోతగా ఉంది.
రెండవది- కేంద్రమే గనుక అప్పు చేస్తే ఆ అప్పుకు భారీగా వడ్డీ చెల్లించాల్సి వుంటుందని వాదిస్తోంది. అదే రాష్ట్రాలు గనుక ఎవరికి వారుగా అప్పులు చేస్తే అంత వడ్డీలు చెల్లించనవసరం లేదంటోంది. ఈ వాదన బత్తిగా అర్ధంలేనిది.
అప్పు చేయడానికి కేంద్రం బహిరంగ మార్కెట్‌ లోకి పోవలసిన అవసరం ఏమొచ్చింది? కేంద్రం వాదన ప్రకారమే ఇది ''దైవ నిర్ణయం''. కనుక రెపో రేటుకే తనకు అప్పు ఇవ్వమని రిజర్వు బ్యాంకును కోరవచ్చు. బ్యాంకులకు రిజర్వు బ్యాంకు అప్పు ఇచ్చినపుడు వసూలు చేసే వడ్డీ రేటునే రెపో రేటు అంటాం. పైగా ఇలా రిజర్వుబ్యాంకు నుంచి అప్పు తెచ్చినందువలన ఆర్థిక వ్యవస్థ లోకి అదనంగా నగదు ప్రవాహం ఏమీ వచ్చి పడిపోదు. అది ఎటూ రిజర్వుబ్యాంకు దగ్గర ఉన్న నగదే కదా.
ఈ విషయం మరింత స్పష్టంగా అర్ధం కావా లంటే ఒక తేలికైన ఉదాహరణ చెప్పాలి. మన లెక్క తేలికగా ఉండడం కోసం దేశంలో ప్రజలంతా నగ దు లావాదేవీలు కాకుండా కేవలం బ్యాంకుల ద్వారా నే లావాదేవీలన్నీ నడుపుతున్నారనుకుందాం. అప్పు డు కేంద్రం రాష్ట్రాలకు జిఎస్‌టి నష్టపరిహారం కింద
రూ. 100 చెల్లించిందనుకుందాం. అప్పుడు అదంతా తిరిగి బ్యాంకులకి డిపాజిట్ల రూపంలో వచ్చేస్తుంది కదా. ఈ అదనపు వనరు నుండి బ్యాంకులు తిరిగి అదనపు రుణాలు ఇవ్వవచ్చు. బ్యాంకులు తాము చేసే ప్రతి రూ. 100 నగదు లావాదేవీలకి రూ. 10 చొప్పున రిజర్వు నిధి ఉంచుకోవాలని అనుకుందాం (దీనినే క్యాష్‌-రిజర్వ్‌ నిష్పత్తి అంటారు). అప్పుడు తమ దగ్గరకు రాష్ట్రాల నుండి వచ్చిన రూ.100కు రూ.10 రిజర్వు నిధిగా ఉంచుకోవాలి. తాము రూ.300 వరకు రుణాలివ్వాలని బ్యాంకులు గనుక అనుకుంటే అప్పుడు అందుకోసం మరో రు. 30 రిజర్వు నిధిగా ఉంచుకోవాలి. రాష్ట్రాలు డిపాజిట్‌ చేసిన రూ.100 లో ఆ విధంగా రూ.40 రిజర్వు నిధి కింద పోతే ఇంకా రూ.60 ఉంటుంది. ఈ రూ.60 తో బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలను రిజర్వుబ్యాంకు నుండి కొనవచ్చు. ఆ విధంగా కేంద్రం రిజర్వు బ్యాంకు నుంచి రు.100 అప్పు తెచ్చినా మొత్తంమీద ఆర్థిక వ్యవస్థలో అదనంగా పెరిగే రిజర్వు ధనం కేవలం రూ.40 మాత్రమే అవుతుంది.
పైగా రిజర్వుబ్యాంకు దగ్గర నుండి రెపో రేటుకే అప్పు తెచ్చింది గనుక, ఆ అప్పు రాష్ట్రాల నుండి తిరిగి బ్యాంకులకు వచ్చి చేరింది కనుక దానితో బ్యాంకులు రుణాలిచ్చే శక్తి పెరుగుతుంది. అది కూడా తక్కువ వడ్డీకే. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులను ఎదుర్కుంటున్న ఈ సమయంలో ఎక్కువ అప్పులు, అది కూడా తక్కువ వడ్డీకి దొరకడం ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి తోడ్పడుతుంది.
కేంద్రం రిజర్వుబ్యాంకు నుండి అప్పు తెచ్చి రాష్ట్రాలకు చెల్లించాల్సిన జిఎస్‌టి నష్ట పరిహారాన్ని చెల్లిస్తే....ఒకటి, కేంద్రం '2017 జిఎస్‌టి చట్టా'న్ని గౌరవించి అమలు చేసినట్లు అవుతుంది. రెండు- రాష్ట్రాలను అనవసరమైన వత్తిళ్లకు గురి చేయనవసరం లేదు. తద్వారా ఫెడరల్‌ స్ఫూర్తికి కట్టుబడినట్లు అవుతుంది. మూడు- తక్కువ వడ్డీలకు రుణాలు వచ్చే అవకాశం కలిగినందున ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి దోహదం చేసినట్టవుతుంది. కాని మోడీ ప్రభుత్వానికి ఆర్థిక విషయాల మీద అవగాహన చాలా తక్కువ. పైగా రాష్ట్రాల మీద ఈ ప్రభుత్వానికి ఏ మాత్రమూ సానుభూతి లేదు. అందుకే ఇంత సరళమైన పరిష్కారాన్ని కూడా వాళ్ళు చూడలేకపోతున్నారు.
జిఎస్‌టి పరిహారం బదులు రాష్ట్రాలే అప్పులు చేసుకోవాలన్న ప్రతిపాదనను జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశంలో రెండు బిజెపిాపాలిత రాష్ట్రాలు మినహా, మిగిలిన రాష్ట్రాలన్నీ వ్యతిరేకించాయి. ముఖ్యంగా కేరళ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. ఫెడరల్‌ రాజ్యాంగ స్ఫూర్తి సజీవంగా ఉండాలంటే కేంద్రం రాష్ట్రాలకు జిఎస్‌టి నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందే.
ప్రభాత్‌ పట్నాయక్‌
(స్వేచ్ఛానుసరణ)