జార్ఖండ్ రాష్ట్రంలో ఓ ప్రధానోపాధ్యాయుడు వినూత్న ఆలోచనతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పిల్లలకు చదువు చెబుతున్నారు. డుమ్కా జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామం దుమార్తర జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఊళ్లోని పాఠశాలలో సుమారు 290 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కోవిడ్ కారణంగా పాఠశాల తెరుచుకోకపోవడంతో పిల్లలు చదువులో వెనకబడుతున్నారని ప్రధానోపాధ్యాయుడు సపన్ పట్రాలేఖ్ గ్రహించారు. విద్యార్థుల ఇళ్ల దగ్గరే పాఠాల బోధనకు అధికారులతో మాట్లాడి, వారిని ఒప్పించారు.
ఆ ఊరిలోని అన్నీ ఇళ్లు దాదాపు మట్టిగోడలతో నిర్మించి ఉన్నాయి. ఆ గోడలనే బ్లాక్ బోర్డులుగా ఉపయోగించుకోవాలనేది ఆ మాస్టారి ఆలోచన. ఆవిధంగా ఊళ్లో నాలుగు ఇళ్లను ఎంచుకున్నారు. ఏ వీధి పిల్లలను ఆ వీధిలోని ఇంటి దగ్గరే భౌతికదూరం పాటిస్తూ కూచోబెట్టారు. పిల్లలందరూ స్కూలు యూనిఫాంతో వచ్చి ఆ ఇంటి మట్టి దిన్నెలపై కూర్చుంటారు. మాస్టార్లు పాఠంలోని ప్రశ్నలను, జవాబులను ఆ బోర్డులపై రాసి ఉంచుతారు. ప్రతి విద్యార్థికి సుద్దముక్క, డస్టర్ ఇస్తున్నారు. పిల్లలు తమ అనుమానాలను, ప్రశ్నలను బోర్డుపై రాసి అడుగుతారు. ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితో సహా నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఒక క్లాస్‌లో 50 మంది విద్యార్థులకు దూరంగా నిలబడి అందరికీ వినిపించేలా పాఠాలు చెబుతున్నారు. ఈ విధంగా గ్రామంలో నాలుగు చోట్ల పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఇళ్ల దగ్గరే పాఠాలను బోధించడం చూసి అధికారులు, గ్రామస్తులు ఉపాధ్యాయులను అభినంది స్తున్నారు. ''లాక్‌డౌన్ సమయంలో విద్యార్థులు పాఠాలను మరిచిపోయే ప్రమాదం ఉంది. ఈ ఊళ్లో ఇంటర్నెట్, మొబైల్ సేవలు అందుబాల్లో లేవు. విద్యార్థుల ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఫలితాలు బాగానే ఉన్నాయి.'' అని ప్రధానోపాధ్యాయుడు పట్రాలేఖ్ అన్నారు.










