Oct 20,2020 17:58

రొమ్ము క్యాన్సర్‌ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాలను కాపాడవచ్చని అమెరికన్‌ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్‌ రేడియేషన్‌ ఆంకాలజిస్టు డాక్టర్‌ సునీత పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్‌ అవగాహన మాసోత్సవాల్లో భాగంగా కొన్ని కీలకాంశాలను ఆమె విశదీకరించారు. మనదేశంలో ఒకప్పుడు క్యాన్సర్‌ బాధిత మహిళల్లో అత్యధిక శాతం మంది గర్భాశయ క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులు ఉండేవారని, అయితే 2008 తర్వాత రొమ్ము క్యాన్సర్‌ ప్రభావం పెరిగినట్లుగా రికార్డులు వెల్లడిస్తున్నాయని ఆమె తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ రొమ్ము క్యాన్సర్‌ తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ప్రధమ స్థానంలో ఉందని, ప్రస్తుతం మొత్తం క్యాన్సర్‌ బాధిత మహిళల్లో 30 శాతం మంది రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతుండగా, దాదాపు 10 శాతం మంది గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్నారని తెలిపారు. వయసు మళ్లిన వారే కాకుండా, యుక్తవయస్సు మహిళలు సైతం రొమ్ము క్యాన్సర్‌ వ్యాధి బారినపడటం ప్రమాదకర పరిణామమని చెప్పారు. 30-40 ఏళ్ల మహిళలు రొమ్ము క్యాన్సర్‌ బారినపడుతున్నారని, మొత్తం క్యాన్సర్‌ పేషేంట్లలో దాదాపు సగం మంది యాభై ఏళ్ల లోపు వయసు వారే ఉండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. రొమ్ము క్యాన్సర్‌ నుండి కోలుకున్న వారి సంఖ్య అమెరికాలో 95 శాతం ఉండగా, మనదేశంలో 60 శాతం మంది మాత్రమే వ్యాధి నుండి కోలుకోగలుగుతున్నారని, వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రొమ్ములో నొప్పి లేకుండా చిన్న చిన్న గడ్డలు ఏర్పడటం రొమ్ము క్యాన్సర్‌ ప్రాథమిక లక్షణమని, ఈ గడ్డ క్రమక్రమంగా పెరుగుతుండటం, చంకలో నొప్పిగా ఉండటం, చర్మం రంగు మారడం తదితర లక్షణాలను రొమ్ము క్యాన్సర్‌గా అనుమానించాల్సి ఉంటుందని అన్నారు. క్యాన్సర్‌ గడ్డలను గుర్తించేందుకు ఎవరికి వారు రొమ్ములను స్వయంగా పరీక్షించుకునేలా యుక్తవయస్సు నుండే అలవాటు చేసుకోవాలని సూచించారు. రొమ్ము క్యాన్సర్‌ గురించి ఆడపిల్లలకు సమగ్రమైన అవగాహన కల్పించాలని, ప్రతినెలా క్రమం తప్పకుండా ఋతుస్రావం ముగిసేరోజున స్నానం చేసే సమయంలో రొమ్ములను పరీక్షించుకునేలా యుక్త వయస్సులోకి అడుగిడగానే ఆడపిల్లలకు అలవాటు చేసి, ఆ అలవాటును జీవితాంతం కొనసాగించేలా చూడాలని వివరించారు. స్వీయ పరీక్ష ద్వారా రొమ్ములో ఏవైనా గడ్డలు ఏర్పడితే వెంటనే గుర్తించి డాక్టర్‌ను సంప్రదించేందుకు అవకాశం లభిస్తుందని అన్నారు. అయితే రొమ్ములో ఏర్పడే అన్ని గడ్డలూ క్యాన్సర్‌ వల్ల వచ్చినవి కాకపోయినప్పటికీ, ఎప్పటికప్పుడు పరీక్షించి జాగ్రత్తగా ఉండటం మంచిదని పేర్కొన్నారు. చాలా మంది తమంతట తాముగా మామ్మోగ్రామ్‌ పరీక్ష చేయించుకుంటున్నారని, దీనివల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. కొన్ని కేసుల్లో మామ్మోగ్రామ్‌ పరీక్ష ద్వారా క్యాన్సర్‌ నిర్ధారణ క్లిష్టంగా ఉంటుందని, అటువంటి కేసుల్లో బ్రెస్ట్‌ ఎంఆర్‌ఐ పరీక్ష నిర్వహించేలా నిపుణులు సూచిస్తారని తెలిపారు. 45 ఏళ్లు దాటిన స్త్రీలు కచ్చితంగా రెండేళ్లకోసారి మామ్మోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలని, రొమ్ములో ఏదైనా అసహజమైన మార్పులను గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ సూచనలను పాటిస్తే రొమ్ము క్యాన్సర్‌ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి క్యాన్సర్‌ బాధిత మహిళల ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు. అక్టోబర్‌ నెలను రొమ్ము క్యాన్సర్‌ అవగాహన మాసోత్సవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో.. రొమ్ము క్యాన్సర్‌పై ఆడబిడ్డలు అవగాహన పెంపొందించుకుని, ఎవరికి వారు స్వయంగా పరీక్షించుకునేలా చైతన్యవంతులను చేయడం, మన మాతమూర్తులకు మామ్మోగ్రామ్‌ పరీక్షలు చేయించడం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించాలని డాక్టర్‌ సునీత అన్నారు.