Oct 28,2020 20:48

మన దేశంలో మహిళల్ని వేధిస్తోన్న వ్యాధుల్లో రొమ్ముక్యాన్సర్‌ ఒకటి. దీనిని ప్రాథమిక దశలో గుర్తించుకోకపోవడం వల్ల, చాలామంది మహిళలు స్క్రీనింగ్‌ పరీక్ష కోసం ముందుకు రాకపోవడం వల్ల సమస్య తీవ్రత పెరుగుతుంది. గ్రామాల్లోనే కాదు, నగరాల్లో సైతం ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. దీనివల్ల నివారించదగిన సమస్య కాస్త ప్రాణాంతక సమస్యగా మారిపోతోంది. ప్రతి ఒక్క మహిళా ముందే అవగాహన పెంచుకుంటేా అప్రమత్తంగా ఉండొచ్చు.. ఆపద నుంచి బయటపడొచ్చు.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం... మనదేశంలో రోజుకు 1300 మంది మహిళలు రొమ్ము క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. 2008 తర్వాత మనదేశంలో రొమ్ము క్యాన్సర్‌ తీవ్రత పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో ప్రస్తుతం 14 శాతం మంది మహిళలే ప్రాథమిక దశలో క్యాన్సర్‌ని గుర్తించి చికిత్స పొందుతున్నారు. 60 శాతం మంది మహిళలు 3, 4 దశల్లో గుర్తించి చికిత్స తీసుకుంటున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే వ్యాధిని మొదట్లోనే గుర్తించగలగాలి.

ఎలా గుర్తించాలి?
రొమ్ములో నొప్పి లేకుండా చిన్న చిన్న గడ్డలు ఏర్పడటం రొమ్ము క్యాన్సర్‌ ప్రాథమిక లక్షణం. ఈ గడ్డ క్రమక్రమంగా పెరుగుతుంది. చంకలో నొప్పిగా ఉండటం, చర్మం రంగు మారడం, దురద వంటి లక్షణాలను రొమ్ము క్యాన్సర్‌గా అనుమానించాలి. క్యాన్సర్‌ గడ్డలను గుర్తించేందుకు ఎవరికి వారు రొమ్ములను స్వయంగా పరీక్షించుకునేలా యుక్తవయస్సు నుంచే అలవాటు చేసుకోవాలి. రొమ్ము క్యాన్సర్‌ గురించి ఆడపిల్లలు సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలి. ప్రతినెలా క్రమం తప్పకుండా రుతుస్రావం ముగిసేరోజున అద్దం ముందు రొమ్ములను పరీక్షించుకునేలా ఆడపిల్లలకు అలవాటు చేసుకోవాలి. రొమ్ములో ఏవైనా గడ్డలు ఏర్పడితే వాటిని గుర్తించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. అయితే రొమ్ములో ఏర్పడే అన్ని గడ్డలూ క్యాన్సర్‌ వల్ల వచ్చినవి కాకపోవచ్చు. అయినా.. ఎప్పటికప్పుడు పరీక్షించి జాగ్రత్తగా ఉండటం మేలు. వయసు మళ్లిన వారే కాకుండా, యుక్తవయస్సు మహిళల సైతం రొమ్ము క్యాన్సర్‌ వ్యాధి బారినపడటం శోచనీయంగా వైద్యులు చెబుతున్నారు. మనదేశంలో మొత్తం క్యాన్సర్‌ బారిన పడిన వారిలో దాదాపుగా సగం మంది యాభై ఏళ్ల లోపు వయసు వారే ఉండటం ఆందోళన కలిగించే అంశంగా గుర్తించారు.

ముందుచూపుతోనే ముప్పు నివారణ

నిపుణుల సూచనలతో..
నేడు ఆన్‌లైన్‌లో దొరికే పరికరాలతో చాలామంది తమంతట తాముగా మామ్మోగ్రామ్‌ పరీక్ష చేయించుకుంటున్నారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని కేసుల్లో మామ్మోగ్రామ్‌ పరీక్ష ద్వారా క్యాన్సర్‌ నిర్ధారణ కష్టతరమవుతుంది. అటువంటి కేసుల్లో బ్రెస్ట్‌ ఎంఆర్‌ఐ నిర్వహించాల్సి ఉంటుంది. 45 ఏళ్లు దాటిన స్త్రీలు కచ్చితంగా రెండేళ్లకోసారి మామ్మోగ్రఫీ చేయించుకోవాలి. రొమ్ములో ఏమైనా అసహజమైన మార్పులను గుర్తిస్తే వైద్యులను సంప్రదించాలి. ఈ సూచనలను పాటిస్తే రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి, ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకోవచ్చు. అక్టోబరు నెలను రొమ్ము క్యాన్సర్‌ అవగాహన మాసోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొంచే కార్యక్రమాలను ప్రభుత్వ, స్వచ్చంధ సంస్థలు నిర్వహిస్తున్నాయి. మహిళలు భాగస్వాములై అవగాహన పెంచుకోవాలి.

అధైర్య పడొద్దు
క్యాన్సర్‌ ఉందని నిర్ధారణ అయిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యంగా ఉన్నప్పుడే చికిత్స ద్వారా త్వరగా నయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దశలను బట్టి చికిత్స ఉంటుంది. చికిత్సలో భాగంగా కీమో, రేడియేషన్‌ల వల్ల వచ్చే కొన్ని రకాల దుష్ప్రభావాలపై అవగాహనతో ఉండాలి. ఈ సమయంలో కుటుంబ సభ్యులు వారికి అన్ని విధాలుగా అండగా నిలవాలి. క్యాన్సర్‌ తగ్గిన తర్వాత కూడా తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. వైద్యుల సలహా మేరకు ఇచ్చిన సమయానుసారంగా పరీక్షల్ని చేయించుకుంటూ, ఆహార నియమాల్ని పాటిస్తూ... వ్యాయామం చేస్తూ... తగు జాగ్రత్తల్ని తీసుకోవాలి.

విస్తారంగా పరీక్షలు జరపాలి
మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 72 శాతం మంది మహిళలు రొమ్ము క్యాన్సర్‌ పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావటం లేదు. కేరళలో 13 శాతం మంది గ్రామీణ మహిళలు ప్రాణం మీదకు తెచ్చుయుంటున్నారని ఓ సర్వే ఆధారంగా వెల్లడైంది. దీంతో అక్కడి ప్రభుత్వం గతేడాది 'క్యూర్‌ ఫుల్లీ' అనే కార్యక్రమం ప్రారంభించింది. దీనిద్వారా 2030 నాటికి రొమ్ము క్యాన్సర్‌ మరణాల్ని సున్నాకి తీసుకురావాలనేది వారి సంకల్పం. ఈ ప్రాజెక్టు కోసం రూ.1.75 కోట్లు వెచ్చించింది. డిజిటల్‌ మొబైల్‌ మామ్మోగ్రఫీ స్క్రీనింగ్‌ పరీక్ష కోసం ఓ వ్యాన్‌ని తయారు చేయించారు. అందుకు ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ నుంచి శిక్షణ పొందిన సిబ్బందిని నియమించారు. దీని ద్వారా ఊరూరా వెళ్లి పరీక్షల్ని నిర్వహిస్తోంది. ఈ అత్యాధునిక మొబైల్‌ స్క్రీనింగ్‌ ద్వారా 30 నిముషాల్లో వ్యాధిని గుర్తిస్తుంది. ఇలాంటి ప్రయత్నం అన్నిచోట్లా జరగాలి.
 

ముందుచూపుతోనే ముప్పు నివారణ

తగు జాగ్రత్తలతో...
'ఒక్కసారి క్యాన్సర్‌ ఉందని నిర్ధారణ అయిన తర్వాత చికిత్స తీసుకున్నా మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాలుంటాయి. అలా రాకుండా ఉండేందుకు మందుల్ని వాడుతూ.. ఆహార, వ్యాయామ విషయాల్లో తగు జాగ్రత్తలు పాటిస్తూ.. సమయానుకూలంగా పరీక్షల్ని చేయించుకోవాలి. చికిత్సానంతరం రక్తహీనత సమస్య దరిచేరకుండా చూసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. తాగుడు, సిగరెట్‌, పాన్‌, గుట్కా వంటి చెడు వ్యసనాలను పూర్తిగా మానేయాలి. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్‌ ఉంటే, వాటికి సంబంధించిన పూర్తి హిస్టరీని ఫ్యామిలీ డాక్టర్‌తో చర్చించి ముందస్తు పరీక్షల్ని చేయించుకోవాలి.
                                                                       - డాక్టర్‌ ఎం.సునీత, రేడియేషన్‌ అంకాలజిస్టు