Oct 16,2023 10:45

న్యూఢిల్లీ : విదేశాల నుంచి రేడియోధార్మిక పదార్థాల అక్రమరవాణా అడ్డుకట్టకు చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తుంది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌తో సహా బంగ్లాదేశ్‌, మయన్మార్‌, నేపాల్‌లతో ఉన్న ఎనిమిది సరిహద్దు చెక్‌పోస్టుల్లో రేడియేషన్‌ డిటెక్షన్‌ పరికరాలను (ఆర్‌డిఇ) ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. పాకిస్థాన్‌ సరిహద్దులోని సమీకృత చెక్‌పోస్టు (ఐసిపి)లు, ల్యాండ్‌ పోర్టులు, బంగ్లాదేశ్‌ సరిహద్దులోని పెట్రాపోల్‌, అగర్తలా, డాకీ, సుతార్‌కండీ, నేపాల్‌ సరిహద్దులోని రాక్సువల్‌ జోగ్‌బానీ, మయన్మార్‌లోని మోరే పోర్టుల్లో ఈ ఆర్‌డిఇలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పరికరాల సరఫరా, ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రభుత్వ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఆర్‌డిఇలకు ప్రత్యేక అలారం వ్యవస్థతోపాటు అనుమానిత వస్తువుల వీడియో ఫ్రేములను రూపొందించే సామర్థ్యం కూడా ఉంటుందని అధికారులు తెలిపారు.