Jul 26,2023 14:33
  • స్త్రీలపై అత్యాచారం అనాగరికం 

ప్రజాశక్తి - తాళ్లరేవు: మణిపూర్ ఘటనలో జాతులు, మతాల మధ్య జరుగుతున్న హింసాత్మక ఘటనలో స్త్రీలపై అత్యాచారాలు చేయడం అమానుషమని తాళ్ళరేవు, యానం యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్లరేవు సంతపేట సెంటర్ నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు జోరువానలో క్రైస్తవ సంఘాలు భారీ ర్యాలీ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మనమంతా భారతీయులమని, మతాలు, కులాలు పేరుతో విడిపోకూడదని అన్నదమ్ముల వలె అందరూ మెలగాలని నినదించారు. మణిపూర్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలను వెంటనే నిలుపుదల చేసి శాంతిని పునరుద్ధరింప చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా అండ్, తాళ్లరేవు మండలం పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు, జడ్పిటిసి దొమ్మేటి సామ్యూల్ సాగర్ మాట్లాడారు. మణిపూర్ లో వివిధ తెగల మధ్య ప్రారంభమైన ఘర్షణలు అనేక అకృత్యాలకు దారితీసాయని అన్నారు. స్త్రీలను నగ్నంగా ఊరేగించడం అనాగరికమైన చర్య అని తెలిపారు. ఈ ఘర్షణలో 250 ప్రార్ధన మందిరాలను  ధ్వంసం చేశారని అన్నారు. ఈ సందర్భంగా శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో దేశ సమైక్యత కోసం మణిపూర్ లో శాంతి నెలకొల్పాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డి.సాల్మన్ రాజు, బి.జార్జి ముల్లర్, పి.జాన్ విక్టర్, కే. జయానంద కుమార్, డి.పురుషోత్తం పి.ప్రతాప్, ఉంగరాల బూరిబాబు, పెద్ద ఎత్తున మహిళలు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.