ప్రజాశక్తి - బనగానపల్లె : రజకులకు అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తామని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని పంచాయతీ సమీపంలో జుర్రేరు వాగు ఒడ్డున రజకులకు, కార్పెంటర్లకు, చేతి వృత్తి చేసుకొని జీవించడానికి జరుగుతున్న పనులను ఎమ్మెల్యే కాటసాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో రజకులకు స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చామని, అందులో భాగంగా రజకులకు, కార్పెంటర్లకు ఇచ్చే స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. కలెక్టర్ రజకులకు రూ.10 లక్షలతో దోబీఘాట్లను మంజూరు చేశారని, ఈ నిధులతో త్వరలోనే దోబీ ఘాట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా పట్టణంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ప్రజలు ఐకమత్యంగా జీవించినప్పుడే పట్టణం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రజకులు లాండ్రీ షాపులు ఏర్పాటు చేసుకోవడానికి తనవంతు సహాయ, సహకారాలు అందిస్తానని తెలిపారు. ఎస్‌ఐ కృష్ణమూర్తి, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ శివరామయ్య, షేక్ ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ అబ్దుల్ ఖైర్, వైసిపి నాయకులు డాక్టర్ మహ్మద్ హుస్సేన్, రజక సంఘం అధ్యక్షులు సుబ్బరాయుడు, నాయకులు సుంకన్న పాల్గొన్నారు.










