జగన్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు అసెంబ్లీలో టిడిపి ప్రభుత్వాన్ని నిలదీస్తూ...కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం, దాన్ని అమలు చేయకుండా ఉద్యోగులను మోసం చేస్తున్నదని...తాము అధికారం లోకి వస్తే వారందరినీ రెగ్యులరైజ్ చేస్తామని అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టో లోనూ అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసులను పరిగణన లోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి రెగ్యులరైజేషన్ కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఎంతో ఆశగా వైసిపి ప్రభుత్వం అధికారం లోకి రావడానికి తమ వంతు కృషి చేశారు. అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయమై ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఐదారు నెలల పాటు ఈ మంత్రివర్గ ఉపసంఘం సమావేశాలు జరిపింది. అనంతరం ఈ మంత్రివర్గ ఉప సంఘానికి సలహా ఇచ్చేందుకు వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో మరో కమిటీ వేశారు. 2020 జూన్ 30 లోగా మంత్రివర్గ ఉప సంఘానికి తమ సలహా ఇవ్వాలని వారికి సమయం నిర్దేశించారు. కార్యదర్శుల కమిటీ యథావిధిగా అన్ని విభాగాల నుండి సమాచారం సేకరించడంలో హడావిడి చేసింది. వారికి ఇచ్చిన సమయం కూడా గడిచి 4 నెలలు మించిపోయినా, ప్రభుత్వం నుండి ఏ కదలికా లేకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగుల్లో అసంతృప్తి ప్రారంభమైంది. ఈ విషయం పసిగట్టిన ప్రభుత్వం నవంబర్ 13న అధికారులతో సమీక్షా సమావేశం జరిపినట్లు... కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నందున, వారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఆ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వార్త వచ్చింది. దీన్నిబట్టి ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాల లాగే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను పక్కకు పెడుతుందనే భావన కాంట్రాక్టు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నది. దాంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదేం కొత్త సాకు కాదు
కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ఆ రెండు ప్రభుత్వాలు కూడా కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై మంత్రివర్గ ఉప సంఘాలను ఏర్పాటు చేశాయి. ఆ ఉప సంఘాలు కూడా రెగ్యులరైజేషన్ కు న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయని, అదువలన ఎవరినీ రెగ్యులరైజ్ చేయకూడదని తీర్మానించాయి. ఆ తరువాతనే వైసిపి పార్టీ గత ఎన్నికలకు ముందు తన మ్యానిఫెస్టోలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు హామీ ఇచ్చింది. ఈ హామీ ఇచ్చేటప్పుడు ఆ పార్టీ ఈ న్యాయపరమైన ఆటంకాల గురించి పరిశీలించలేదా? పరిశీలించినా వాటిని అధిగమించి, రెగ్యులరైజ్ చేయవచ్చు అనుకున్నారా? లేక హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారం లోకి వచ్చాక, రెగ్యులరైజ్ చేయకపోయినా, ఈ ఉద్యోగులు ఏం చేయగలరన్న మోసపూరిత వైఖరితో వ్యవహరించారా? అనేది తేలాల్సి వుంది.
చిత్తశుద్ధి ఉందా?
గత నాలుగైదు సంవత్సరాలలో పంజాబ్, ఒడిషా, హర్యానా తదితర రాష్ట్రాల్లో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన అనుభవాలు ఉన్నాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పదేళ్ళకు పైగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే, రెగ్యులరైజేషన్ కోరుతున్న ఉద్యోగ సంఘాలు, ప్రత్యేకించి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సంఘాలతో సమావేశం జరపాలి. రెగ్యులరైజేషన్‌కు ఆటంకాలుగా ఉన్న అంశాలు ఏమిటనేది వారి ముందు చర్చకు పెట్టాలి. వాటిని అధిగమించేందుకు ఉద్యోగ సంఘాల నుండి సలహాలు తీసుకోవాలి. దాని ప్రకారం రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభించాలి. ఇవేమీ చేయకుండా ముందుగానే రెగ్యులరైజేషన్ సాధ్యం కాదని, ప్రభుత్వం తనంతట తానుగా నిర్ధారణకు రావడాన్ని బట్టి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది.
న్యాయ స్థానాల్లో నిలబడతాయా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా ఈ ప్రభుత్వం గత ఏడాదిన్నరగా అనేక నిర్ణయాలు చేసింది. ఆ నిర్ణయాలను హైకోర్టు నిలిపివేస్తే, సుప్రీంకోర్టుకు అప్పీలు చేసింది. అక్కడ కాకపోతే సుప్రీంకోర్టు బెంచ్‌కి వెళ్ళింది. అక్కడా చుక్కెదురైనప్పుడు వెనక్కు తగ్గింది. ప్రభుత్వం చేసిన కొన్ని నిర్ణయాలు నేటికీ కోర్టులలో నలుగుతున్న విషయం మనందరికీ తెలుసు. అంటే ప్రభుత్వం తాను చేయదలచుకున్న పనుల విషయంలో అంత పట్టుదలగా వ్యవహరిస్తున్నది. కానీ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేసేందుకు సిద్ధంగా లేదంటే అది ప్రభుత్వ చిత్తశుద్ధి లోపంగా అనిపించటం లేదా ?
రెగ్యులరైజేషన్ బదులు, పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు సిద్ధం చేయమని ఆదేశించటం కూడా ఉద్యోగులను తప్పు దారి పట్టించటం, భ్రమలు కల్పించటమే అవుతుంది. రెగ్యులర్ ఉద్యోగులకు పే స్కేళ్లు అమలు చేస్తారు. బేసిక్, డి.ఏ, హెచ్‌ఆర్‌ఏ లు ఇస్తారు. ఇంక్రిమెంట్లు ఉంటాయి. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇవేమీ లేవు. వీరికి క్యాజువల్ లీవులు మాత్రమే ఉండగా, పర్మినెంట్ ఉద్యోగులకు వాటితో పాటు ఎరన్డ్ లీవులు, మెడికల్ లీవులు ఉన్నాయి. ఉచిత వైద్య సౌకర్యం ఉంది. సర్వీసులో ఉండగా చనిపోతే, కుటుంబ సభ్యులకు కంపాసినేట్ అపాయింట్‌మెంట్ కింద పర్మినెంట్ ఉద్యోగం ఇస్తారు. రిటైర్మెంట్ సందర్భంగా గ్రాట్యుటీ వస్తుంది. రిటైర్ అయిన ఉద్యోగికి పెన్షన్ వస్తుంది. పెన్షనర్ చనిపోయినా, వారి భర్త/భార్యకు కుటుంబ పెన్షన్ వస్తుంది. వారి సర్వీసు కాలంలో ఒకటో, రెండో ప్రమోషన్లు వస్తాయి. నిర్ణీత సర్వీసు తరువాత కోరుకున్న స్థలానికి బదిలీ సౌకర్యమూ ఉంటుంది. వీటిన్నింటినీ రెగ్యులరైజ్ చేయకుండా కాంట్రాక్టు ఉద్యోగులకు కల్పించే అవకాశం ఎలా ఉంటుంది?
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే ఇస్తే, అవి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కంటే మెరుగైనవి ఇవ్వటం ఎలా సాధ్యమౌతుంది? కాంట్రాక్టు ఉద్యోగులకు అదనంగా ఏం ప్రయోజనం కల్పించినట్లవుతుంది? ఇప్పటిలాగే రెన్యువల్ ఆర్డర్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి యథాతథంగా కొనసాగుతుంది కదా?
2001, 2002, 2003లో నాటి టిడిపి ప్రభుత్వ హయాంలో బేసిక్, డి.ఏ, అలవెన్సులతో కూడిన స్థూల వేతనంతో కాంట్రాక్టు ఉద్యోగులు నియమించబడ్డారు. 2007లో అదే టిడిపి ప్రభుత్వం అదే ఉద్యోగులకు స్థూల వేతనం రద్దు చేసి, కన్సాలిడేటెడ్ వేతనాన్ని నిర్ణయించింది. అంటే రెగ్యులరైజేషన్ స్థానంలో ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వజూపే ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా తాత్కాలికమైనవే. వాటన్నింటినీ ఇదే ప్రభుత్వంగానీ, వచ్చే ప్రభుత్వాలుగానీ కొనసాగిస్తాయన్న గ్యారెంటీ ఏమీ లేదు. ఏతావాతా రెగ్యులరైజేషన్‌ను పక్కదారి పట్టించేందుకు వేసిన ఎత్తుగడే ఈ ఆర్థిక ప్రయోజనాల పాచిక తప్ప మరొకటి కాదు.
అందుకే రెగ్యులరైజేషన్‌కు ఏదీ ప్రత్యామ్నాయం కాదని, ఉద్యోగులు సరిగానే భావిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో లక్షలాదిగా ఖాళీ పోస్టులు ఉన్నాయి. జిల్లాల సంఖ్య పెంచనుండటంతో కొత్త జిల్లాల్లో అన్ని శాఖల్లో కొత్త ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. వీటినన్నింటికీ అవసరమైన పర్మినెంట్ ఉద్యోగాల కేటాయింపు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలకు దశాబ్దాలుగా రెగ్యులర్ పోస్టులు మంజూరు చేయలేదు. ప్రస్తుతం ప్రతి పార్లమెంటు నియోజక వర్గంలో ఒక మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా బోధనాసుపత్రులను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో 560 అర్బన్ హెల్త్ క్లినిక్‌లు కొత్తగా ఏర్పాటు చేయనున్నది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అదనంగా ఏర్పాటు చేస్తున్నది. వీటన్నింటికీ అదనంగా రెగ్యులర్ పోస్టులు మంజూరు చేయాల్సి ఉంది. ఈ ఉద్యోగాలన్నింటిలో ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయవచ్చు. ఖాళీ పోస్టులు ఉన్నప్పుడు, సక్రమంగా నియమించబడ్డ కాంట్రాక్టు ఉద్యోగులను ఆ ఖాళీల్లో రెగ్యులరైజ్ చేసేందుకు ఎలాంటి న్యాయపరమైన ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉండదు.
ప్రభుత్వం ఇప్పటికైనా కుంటి సాకులు వెతకటం, దొడ్డి దారి ప్రయత్నాలు చేయడం మాని ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు చిత్తశుద్ధితో ప్రయత్నాలు ప్రారంభించాలి. లేదంటే ఉద్యోగుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది.
వై.నేతాజీ
(వ్యాసకర్త జెఏసి ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ చైర్మన్, గుంటూరు జిల్లా,
సెల్ : 94900 98625)











