Aug 16,2023 22:15
  • ఆలోపు ఉంటే క్రమబద్ధీకరణ
  • కాంట్రాక్టు ఉద్యోగులపై ప్రభుత్వం నిర్ణయం!
  • త్వరలో ఉత్తర్వులంటున్న ఉద్యోగ సంఘాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులుగా చేరిన వారిని రెగ్యులర్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2014 జూన్‌ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీస్‌ పూర్తయిన వారిని రెగ్యులర్‌ చేయాలని గతంలో రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్‌ 2 కంటే ముందు నియమించబడి ఇప్పటి వరకు కొనసాగుతున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆగస్టు 15న సంతకం చేశారని ఉద్యోగ సంఘాలు బుధవారం తెలిపాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ సంబంధిత అధికారుల నుంచి గానీ ఎటువంటి అధికారిక ఉత్తర్వులు, ప్రకటనలు రాలేదు. రెగ్యులర్‌పై ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు విధిస్తుందో వేచిచూడాల్సి ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లోనే సుమారు లక్ష మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2014 జూన్‌ 2వ తేదీ నాటికి ఐదేళ్లు పూర్తయిన వారిని రెగ్యులర్‌ చేయాలని ప్రభుత్వం ముందుగా ప్రకటించింది.
ఈ నిర్ణయం ప్రకారం 6,667 మంది అర్హులని ప్రభుత్వం తేల్చింది. ఇప్పుడు ఐదేళ్ల నిబంధనను రద్దు చేయడంతో సుమారు మరో 4 వేల మందికి అవకాశం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. వీలైనంత ఎక్కువమందిని రెగ్యులర్‌ చేయాలనే ఉద్దేశంతో ఏ సంఘం డిమాండ్‌ చేయకపోయినా స్వయంగా ముఖ్యమంత్రి ఐదేళ్ల నిబంధన తొలగించారని ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ కాకర్ల వెంకట రామిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై సిఎం ఆగస్టు 15న సంతకం చేశారని వెల్లడించారు. 4-5 రోజుల్లో ఉత్తర్వులు కూడా వెలువడతాయని అన్నారు. కాగా రాష్ట్ర మంత్రిమండలి గతంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఎక్కువ మందికి ప్రయోజనం ఉండదని, తాము ప్రభుత్వానికి పలుసార్లు ప్రతిపాదనలు అందించామని ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు మరో ప్రకటన చేయడం గమనార్హం.

కటాఫ్‌ 2022 డిసెంబర్‌ తీసుకోవాలి

2022 డిసెంబరు నాటికి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేయాలని ఎపి స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్టు, అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌, టీచర్స్‌ అండ్‌ వర్కర్స్‌ జెఎసి ఛైర్మన్‌ ఎవి నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ తరహా 2014 జూన్‌ 2వ తేదీ నాటికి పనిచేస్తున్నవారిని రెగ్యులర్‌ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరూ ఒక్కటేనని, అందర్నీ రెగ్యులర్‌ చేస్తామని ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగి ఎన్నేళ్లు సర్వీస్‌ పూర్తయితే రెగ్యులర్‌ చేస్తారో నిర్దిష్టమైన ఉత్తర్వులు, కటాఫ్‌ నిర్ణయించాలని తెలిపారు.