- దేవాదాయ, ఛారిటీ భూములు మినహాయింపు
- జీఓ ఎంఎస్ 310 విడుదల
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా సర్వీస్ ఇనామ్ భూములను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జీఓ ఎంఎస్ నెంబరు 310ని విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజా జిఓలో మతపరమైన, దేవాదాయశాఖకు సంబంధించిన ఇనామ్ భూములు, ,భూదాన్ కింద ఉన్నటువంటి ఛారిటీ భూములను క్రమబద్దీకరణ నుంచి మినహాయించారు. క్షౌర వృత్తిదారులు, వడ్రంగి, కమ్మరి, రజక వృత్తిదారులు, కుమ్మరులు వంటి గ్రామాల్లో చేతి వృత్తులు చేసుకుంటూ జీవనం సాగించే వారికి సంబంధించిన గ్రామ సర్వీస్ ఇనామ్ భూములకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లబ్ధి చేకూరుతుంది. 1956లో ఇనామ్ చట్టం రావడంతో అప్పటి వరకు ఇనామ్ కింద ఉన్న భూములను రద్దు చేసి వారికి రైత్వారీ పట్టాలు ఇచ్చారు. 16/2013 ద్వారా సవరించిన ఆంద్రప్రదేశ్ ఇనామ్‌ల (రద్దు, రైత్వారీగా మార్చడం) చట్టం 1956లోని నిబంధనలు గ్రామ కళాకారులు/ గ్రామసేవ ఇనామ్‌కు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. వృత్తిదారులు, గ్రామ సేవా ఇనామ్‌ల విషయంలో ఇప్పటికే మంజూరు చేసిన రైత్వారీ పట్టాలు చెల్లుబాటు అవుతాయని, అటువంటి పట్టాదారు వారి చట్టపరమైన వారసులు/కొనుగోలు దారులు అన్ని రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారుగా నమోదు చేయబడతారని రెవెన్యూ సిబ్బంది గమనించాలని జీఓలో ప్రభుత్వం పేర్కొంది. కొందరు రైతులు తమ అవసరాల కోసం ఆయా భూములను అమ్ముకోగా, మరికొందరు వారసులకు ఆయా భూములును ఇచ్చారు. 2013లో ఈచట్టానికి సవరణ చేశారు. దేవాలయాలు, ధార్మిక సంస్థలకు ఇచ్చిన ఇనామ్ భూములను ఉద్ధేశించి సవరణ జరిగింది. వీటి ద్వారా లబ్ధి పొందిన వారు ఆ సర్వీసును అందించినంత కాలం ఆ భూమిపైన వచ్చే ఫలసాయాన్ని అనుభవించడమే తప్ప అమ్ముకునేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా దేవాదాయ భూములను 22 (ఎ)లో పెట్టారు. ఇదే సందర్భంలో గ్రామాల్లో చేతి వృత్తులు చేసుకుని జీవనం సాగిస్తున్న వారి ఇనామ్ భూములను కూడా 22(ఎ)లో చేర్చారు. గ్రామ సర్వీస్ ఇనామ్ భూములను క్రమబద్దీకరించడంతో 1,68,603.71 ఎకరాలు నిషేధిత జాబితానుంచి విముక్తి కలుగుతుంది. భూముల రీసర్వే సమయంలో గ్రామ సేవాఇనామ్‌లు , వారికి మంజూరైన రైత్వారీ పట్టాదారుల నుంచి భూములను కొనుగోలు చేసినట్లు రైతుల నుంచి అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. తమ పేర్లను రెవెన్యూ అధికారులు రికార్డుల్లో నమోదు చేయడం లేదని ఫ్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సర్వీస్ ఇనామ్ భూములను క్రమబద్దీకరిస్తూ నిర్ణయం తీసుకుంది.










