Nov 01,2020 20:49

సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్‌

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ విమర్శించారు. నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 17 నెలల వైసిపి పాలనలో రాష్ట్రంలో దళితులు, బిసిలు, మహిళలు, రైతులపై అనుసరిస్తున్న క్రూరత్వ వైఖరి పరాకాష్టకు చేరుతోందన్నారు. రాజధానిలో రైతు కుటుంబాలు, మహిళలపై దాడులు చేస్తూ పోలీసులు వ్యవహరించిన తీరు కీచకపర్వాన్ని తలపించిందన్నారు. మహిళలపై దాడులు చేసిన పోలీసులపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి రాజధాని ఉండాలని ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులకు, వారి కుటుంబాల్లోని మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ జీతం తీసుకుని ప్రజలపై విచక్షణ మరచి పోలీసులు దాడి చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఈ దాష్టీకానికి నైతిక బాధ్యత వహిస్తూ డిజిపి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ ప్రాంతంలో నివాసముంటున్న పోలీస్‌ కుటుంబాలు కూడా అమరావతి రాజధాని కావాలని భూములిచ్చిన వారిలో ఉన్నాయని, వారిపైనా పోలీసులు ఇదే ప్రవర్తనతో ముందుకెళ్తారా అని ప్రశ్నించారు. భూములు కోల్పోయిన వారు శాంతియుతంగా పోరాటం చేస్తుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పెయిడ్‌ ఆర్టిస్టులను పెట్టి వారిని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ మూడు రాజధానులు అంటూ ప్రకటించాక, వైసిపికి చెందిన పెయిడ్‌ ఆర్టిస్టులు మూడు రాజధానులు కావాలని పోటీ ర్యాలీలు నిర్వహించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రైతులకు అన్యాయం జరిగిందని ప్రశ్నించినందుకు రైతులకు సంకెళ్లు వేశారని, రూ.వేల కోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన మీకెందుకు సంకెళ్లు వేయకూడదన్నారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని చెప్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు స్థానిక సంస్థల ఎన్నికల ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. పాఠశాలలను ప్రారంభించి పిల్లలకు కరోనా వ్యాప్తి జరిగితే, ఆ వంకతో స్థానిక ఎన్నికలను దూరం పెట్టొచ్చని చూస్తున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గుండ లకీëదేవి మాట్లాడుతూ మహిళలపై జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి హేయమైందన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన మహిళలపై మగ పోలీసులు దాడి చేయడం ప్రభుత్వ దమన నీతికి అద్దం పడుతోందన్నారు. మహిళలపై అనుచిత ప్రవర్తనకు పాల్పడిన పోలీసులపై దిశ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో డిసిసిబి మాజీ చైర్మన్‌ సింతు సుధాకర్‌. టిడిపి నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, నాయకులు ప్రధాన విజయరాం, జల్లు రాజీవ్‌, విభూతి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.