Jan 31,2021 12:31

రొచ్చులో దొర్లించి చూపించారు
మురుగులో ముంచి ఇదేనన్నారు
రంకుదన్నారు బొంకుతుందన్నారు
దేన్ని ... రాజకీయాన్ని
ఎవరు? ... అందులో పొర్లే రాబందులే
మీరెందుకు దూరారూ అంటే ...
తరాలనాటి పొరపాటన్నారు
మురుగు కడగలేక ... రొచ్చు ఊబి దాటలేక
అందులోనే సందు చూసుకున్నామన్నారు

పందికో నిజాయితీ ఉంది
బురద బతుకును చూపడంలో
వ్యాపారికో విధానముంది
లాభం కోసం ఈదుతున్నాననడంలో
స్వా'ర్థం' పరమార్థమైన రాజకీయ నాయకునికే
ఏదీ లేదు.. రాజకీయం వద్దనడంలో
సారీ ... ఉంది ఉంది ... అది వంచన

రాజకీయం మంచిదే ... బతుకు బాగుపడడానికి
కూడూ గూడా నీడా వసతిలో
మెరుగు సాధించడానికి
అది జనం చేతి ఆయుధమైనప్పుడు

ఉత్పత్తీ పంపణీల తీరు నిర్ణయించేదీ
పనీ పెట్టుబడి ఫలితాలు నిర్ణయించేదీ
అదే ... అదే ... రాజకీయం
జనం దానికి దూరం కావడమంటే
శ్రమజీవి ప్రతిఫలం నోరు నొక్కడమే
పెట్టుబడి దోపిడీకి పెత్తనం ఇవ్వడమే

అందుకే..రాజకీయం వద్దనే వాడి
మాయా జూదం జుట్టు పట్టి కట్టేయాలి
జనతకేం కావాలో తేల్చి చూపాలి

- ఉన్నం వెంకటేశ్వర్లు
8332807330