
ఆగస్టు 9, 15 తేదీలకు ఒక ప్రత్యేకత వున్నది. మొదటిది దేశాన్ని విడిచి పొమ్మని (క్విట్ ఇండియా) బ్రిటీష్ పాలకులకు హెచ్చరిక జారీచేసిన రోజు. ఆ తరువాత జరిగిన పోరాటాలతో స్వాతంత్య్రం సాధించిన రోజు రెండోది. క్విట్ ఇండియా స్ఫూర్తితో మోడీ పాలన నుండి దేశానికి విముక్తి కల్పించాలని కేంద్ర కార్మిక సంఘాలు ఆగస్టు 9కి పిలుపు ఇచ్చాయి. ఈ పిలుపు జయప్రదం కోసం జాతీయ సదస్సు తదుపరి రాష్ట్రంలో కృషి జరుగుతోంది. ఆగస్టు 9న భారీ సమీకరణతో విజయవాడతో పాటు మిగతా జిల్లా కేంద్రాల్లో మహా ధర్నాలు జరుగుతాయి. మోడీని గద్దె దింపి దేశాన్ని కాపాడాలని కేంద్ర కార్మిక సంఘాల పిలుపు. ఇది దేశవ్యాప్తంగా హోరెత్తనున్న బృహత్తర కార్యక్రమం.
మోడీని గద్దె దింపాలనే పిలుపు ఆగష్టు క్యాంపైన్‌తో ఆగిపోదు. 2024 ఎన్నికల్లో మోడీని ఓడించేవరకు ఇది కొనసాగుతుంది. ఆగస్టు 24న న్యూఢిల్లీలో జరిగే కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా జాయింట్ సదస్సులో ఐక్య పోరాటాలకు పిలుపు వస్తుంది. దీనితో పాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ మోడీని ఓడించడమే తమ లక్ష్యమని ప్రకటించాయి. దీని కోసం ''భారత జాతీయ అభివృద్ధికర, సమ్మిళిత సంఘటన'' (ఇండియా)ను ఏర్పాటు చేశాయి.
మోడీ మీదకు అందరూ ఎందుకు దండెత్తుతున్నారు? మోడీ ప్రభుత్వం వలన వచ్చిన ప్రమాదం ఏమిటి? ముఖ్యంగా కార్మికులు, ఇతర శ్రామిక వర్గాలకు బిజెపి మరలా అధికారంలోకి వస్తే వచ్చే ప్రమాదం ఎలా ఉంటుంది?
- ఏమిటి ప్రమాదం?
మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం మరలా తిరిగి అధికారంలోకి వస్తే దేశంలో ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థా మిగలదు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మోడీ ప్రభుత్వానికి ప్రత్యేకమైన డిక్షనరీ ఉంది. దాంట్లో అర్ధాలు వేరుగా ఉంటాయి. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు వేళ్ళూనుకున్నాయి కాబట్టి దేశం తన కాళ్ళ మీద తాను నిలబడిందని, అదే స్వావలంబన అని మనందరికీ తెలుసు. మోడీ ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థల విధానం ప్రకారం వ్యూహాత్మక, కీలక రంగాలతో సహా ఏ ఒక్క దానిలోనూ ప్రభుత్వం యజమానిగా ఉండదు. ప్రభుత్వ రంగ సంస్థలను కూలగొట్టే ఈ విచ్ఛిన్నకర విధానానికి స్వావలంబన (ఆత్మనిర్భర్) పేరు పెట్టడం మోడీకే చెల్లింది. ఇంత మోసకారి ప్రభుత్వం మరొకటి లేదు.
మోడీ విధానాల వలన లక్షలాది మంది ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు, ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోతారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ను నిర్వీర్యం చేసి లక్ష మందికి మోడీ ప్రభుత్వం ఉద్వాసన పలికిన అనుభవం మన ముందు ఉంది. ప్రభుత్వ రంగం లేకపోతే సామాజిక తరగతులు తమ రిజర్వేషన్లు కోల్పోతాయి. సామాజిక న్యాయం కనుమరుగవుతుంది. లక్షల కోట్ల రూపాయల విలువచేసే ప్రజల ఆస్తులు ఇప్పటికే తెగబలిసిన అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ ధనికుల చేతుల్లోకి పోతాయి.
మోడీ తిరిగి అధికారంలోకి వస్తే ముఖ్యమైన కార్మిక హక్కులు ఎగిరిపోతాయి. పర్మినెంట్ ఉద్యోగాల స్థానంలో 1, 2 లేదా 3 సంవత్సరాలు మాత్రమే ఉండే నిర్ధారిత కాల ఉద్యోగాలు ప్రవేశిస్తాయి. సమ్మె చేయటం అసాధ్యమవుతుంది. ప్రభుత్వ అనుమతి లేకుండానే కార్మికులను తొలగించే అధికారం యజమానుల సొంతమవుతుంది. పని గంటలు, సెలవులు తదితర హక్కుల అమలును నిలిపివేసే అధికారం ప్రభుత్వాలకు వస్తుంది. ఇక బానిసత్వమే కార్మికులకు శాశ్వతమవుతుంది.
మోడీ ప్రభుత్వం కాకుల్ని కొట్టి గద్దలకు వేస్తోంది. కార్పొరేట్ కంపెనీలకు ఆదాయ పన్ను 8 శాతం తగ్గించింది. అదే సమయంలో సామాన్య ప్రజలపై పెట్రోలు, డీజిలు, వంటగ్యాసు భారాలను 2023-24 సంవత్సరానికి రూ.3 లక్షల 40 వేల కోట్లు వేసింది. పాలు, బియ్యం, పప్పులు, ఉప్పుల ప్యాకింగ్‌ల మీద కొత్తగా 5 శాతం జీఎస్టీ పన్ను వేసింది. మోడీ అధికారంలోకి రాకముందు పీపా ముడి చమురు 107 డాలర్లు ఉండగా నేడు అది 78 డాలర్లకు తగ్గింది. కానీ మోడీ ప్రభుత్వ దోపిడీ వలన లీటరు పెట్రోలు రూ.71 నుండి రూ.111కు, డీజిలు రూ.67 నుండి రూ.99కు, వంటగ్యాసు రూ.410 నుండి రూ.1,127కు పెరిగింది. అతి తక్కువ వేతనాలతో జీవితాలను గడుపుతున్న కార్మికులు ఈ భారాలను మోయలేరు.
కార్మిక సంఘాలు సమర్పించిన కోర్కెల పత్రంలో ఉన్న ఏ ఒక్క డిమాండ్‌ను మోడీ ప్రభుత్వం పరిష్కరించలేదు. కార్మికుల సమస్యలపై ప్రతి సంవత్సరం చర్చించి పరిష్కరించటానికి అవకాశం ఉన్న భారత కార్మిక మహాసభను గత 8 సంవత్సరాలుగా నిర్వహించడం లేదు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాలు అఖిల భారత సార్వత్రిక సమ్మెలు నిర్వహిస్తున్నాయి. అయినా వాటిని పిలిచి చర్చలు చేయాలన్న కనీస ఇంగిత జ్ఞానాన్ని కూడా మోడీ ప్రభుత్వం ప్రదర్శించలేదు. చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లయింది. ఈ ప్రభుత్వం కొనసాగితే సంపద సృష్టికర్తలైన కార్మికులకు ఎటువంటి భద్రత లేకుండా పోయి తీవ్ర నష్టం వస్తుంది.
ప్రభుత్వం చేతుల్లో ఉన్న మౌలిక సౌకర్యాలైన విద్యుత్తు, రైళ్లు, రోడ్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు తదితరాలు ప్రజల డబ్బుతో అభివృద్ధి అయ్యాయి. వాటిని కారుచౌకగా లీజుకు మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు అప్పజెప్పాలని నిర్ణయించింది. ఇప్పటికే మోడీ పాలనలో 149 మంది అత్యంత ధనవంతుల వద్ద రూ.100 లక్షల కోట్లు సంపద పోగు పడింది. అదే సమయంలో ఆర్థికంగా అడుగున ఉన్న 70 కోట్ల మంది ప్రజల వద్ద కేవలం 3 శాతం సంపద మాత్రమే ఉంది. ఈ అసమానతలను తగ్గించాలని ప్రకృతి వనరులన్నీ ప్రభుత్వం చేతుల్లో ఉండాలని ఉన్న రాజ్యాంగ ఆదేశాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం పని చేస్తోంది. మోడీ ప్రభుత్వం కొనసాగితే ఈ అసమానతల కారణంగా ఆర్థిక సంక్షోభం పెరిగిపోయి శ్రామికుల జీవితాలు బుగ్గి అవుతాయి.
ఇంతకు ముందు ఎపుడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం, ఆకలి పెరిగిపోతోంది. ఉపాధి, ఆకలి, కొనుగోలు శక్తి తదితర గణాంకాలను తారుమారు చేసి ప్రజలకు కనపడకుండా చేయాలని మోడీ ప్రభుత్వం చూస్తోంది. నిరుద్యోగం పెరిగే కొద్దీ ఉపాధిలో ఉన్న కార్మికులకు ప్రమాదం. ఉద్యోగులు-నిరుద్యోగులను విభజించి పబ్బం గడుపుకోవాలనేది మోడీ ప్రభుత్వ విధానం. మోడీ ప్రభుత్వం కొనసాగితే కార్మిక ఐక్యతకు భంగం కలుగుతుంది. బిజెపి, దాని అనుబంధ సంస్థలు మతం పేరుతో మైనార్టీలపై దాడులకు, హత్యలకు పూనుకుంటున్నాయి. మోడీ నాయకత్వంలోని బిజెపి...మైనార్టీలపై విద్వేషాలను రెచ్చగొడుతూ వారిపై మెజార్టీ మతస్తులలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. ఓట్ల కోసం మతాల మధ్య చిచ్చు రేపుతున్నది. సామాజిక తరగతులకు రక్షణ లేకుండా పోయింది. మైనార్టీలకు, సామాజిక తరగతులకు రక్షణ కావాలంటే మోడీ ప్రభుత్వాన్ని తప్పని సరిగా ఓడించి తీరాలి.
- రాష్ట్రంలో కర్తవ్యం
రాష్ట్రంలో బిజెపి బలహీనంగా ఉంది కాబట్టి, దాని ప్రమాదం ఇక్కడ లేదనుకోవటం పొరపాటు. బిజెపి కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వైసిపి, టిడిపిలు బలపరుస్తున్నాయి. జనసేన ఏకంగా బిజెపి పంచన చేరింది. కార్మిక హక్కులను హరించే లేబర్ కోడ్ బిల్లులను పార్లమెంట్‌లో వైసిపి, టిడిపిలు బలపర్చాయి. రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు అనుకూలంగా ఈ రెండు పార్టీలు ఓట్లు వేశాయి. విద్యుత్, మునిసిపల్ సంస్కరణలను గతంలో టిడిపి బలపర్చింది. ఇపుడు మోడీ ప్రభుత్వం ఆదేశించిందే తడవుగా 5 లక్షలు దాటిన నగరాల్లో మొదటి దఫాగా ఇంటి పన్నులు పెంచమంటే, మొత్తం మునిసిపల్ పట్టణాల్లో పన్నులు పెంచి మోడీ పట్ల తన ప్రభు భక్తిని వైసిపి ప్రభుత్వం చాటుకుంది. మోడీ ఆదేశానుసారం వైసిపి ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణలను అమలు చేసి విద్యుత్ చార్జీలను పదేపదే పెంచుతోంది. ప్రజలపై భారాలను మోపటంలో వైసిపి ప్రభుత్వం ముందడుగులో ఉంది.
దేశంలో బిజెపి, దాని అనుబంధ సంస్థలు మైనార్టీల పైన, వారి ప్రార్థనా స్థలాలపైన దాడులకు తెగబడుతుంటే ప్రజాస్వామ్యవాదులను అక్రమంగా అరెస్టులు చేసి జైళ్లపాలు చేస్తుంటే ...వైసిపి, టిడిపి, జనసేనలు కనీసం స్పందించడం లేదు. మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై నోరెత్తటం లేదు. ఈ మూడు పార్టీలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశానికి, మన రాష్ట్రానికి బిజెపి వలన వస్తున్న ప్రమాదాన్ని చూసీ చూడనట్లు నటిస్తున్నాయి. ఈ మూడు పార్టీల అవకాశవాదాన్ని ప్రజలు తిప్పికొట్టాలి.
వ్యాసకర్త : పి. అజయకుమార్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు