May 10,2023 15:24

ప్రజాశక్తి-కాకినాడ : దళితుల ఐక్యత హక్కుల కోసం, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడుని స్థాపించి భారతదేశ సుప్రీం కోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ చెల్లదని తేల్చి చెప్పిన మహానుభావుడు దివంగత పివి రావు అని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ పేర్కొన్నారు. దివంగత పివి రావు 72వ జయంతి సందర్భంగా కాకినాడ ఆర్అండ్బి అతిథి గృహంలో సంఘం ఆధ్వర్యంలో పీవీరావు జయంతి వేడుకలు నిర్వహించి ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ వ్యతిరేకంగా కొంతమంది స్వార్థపూరితంగా 59 కులాలకు సమానంగా 15 శాతం ఉన్న రిజర్వేషన్లను వర్గీకరించాలని, దళితులను విచ్ఛిన్నం చేయాలని చూసిన దుష్ట శక్తులకు పివి బుద్ధి చెప్పారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం మాల కులస్తులంతా ఏకమై ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేక పోరాట ఉద్యమంలో భాగస్వాములు కావాలని పండు పిలుపునిచ్చారు. అనంతరం పివి జయంతి సందర్భంగా కేకుని కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సీకోటి ఆప్పలకొండ, కొల్లాబత్తుల అప్పారావు, నాయకులు మాతా సుబ్బు బాయ్, గుడాల కృష్ణ, సుబ్రహ్మణ్యం, జక్కల ప్రసాద్, బత్తిన సామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.