Aug 29,2023 17:53

మాస్కో :   జి20 సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హాజరుకావడం లేదు. రష్యా తరపున రష్యా ఫెడరేషన్‌ విదేశాంగ మంత్రి హెచ్‌.ఇ. సెర్గీ లావ్రోవ్‌ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీకి స్వయంగా రష్యా అధ్యక్షుడు ఫోన్‌లో తెలిపినట్లు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్‌ 9, 10 తేదీలలో ఢిల్లీలో జరగనున్న జి20 సదస్సుకి తాను హాజరుకావడం లేదని సోమవారం ప్రధాని మోడీతో నిర్వహించిన ఫోన్‌ సంభాషణలో పుతిన్‌ తెలియజేశారు. తన తరపున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ పాల్గననున్నారని పేర్కొన్నట్లు ఆ ప్రకటన తెలిపింది. జి20లో భాగంగా భారత్‌ చేపడుతున్న అన్ని కార్యక్రమాలకు రష్యా అందించిన మద్దతుకు ప్రధాని ధన్యవాదాలు తెలిపినట్లు వెల్లడించింది.