మాస్కో : దేశ రాజధాని ఢిలీలో వచ్చే నెల సెప్టెంబర్‌లో 9-10 తేదీల్లో జి-20 సమావేశాలు జరగనున్నాయి. భారత్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో జరిగే జి- 20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి హాజరయ్యే ఆలోచన లేదని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ శుక్రవారం వెల్లడించారు. అయితే రష్యా - ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు అధ్యక్షుడు పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే, ఈ వారెంట్ వల్లే పుతిన్ విదేశాలకు వెళ్లడం లేదనే ప్రచారాన్ని పెస్కోవ్ తీవ్రంగా ఖండించారు.
కాగా, ఆగస్టు 22 నుంచి 24 వరకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో పుతిన్ వర్చువల్‌గా హాజరయ్యారు.