Sep 12,2023 11:08

న్యూఢిల్లీ :   న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను చైనా సోమవారం స్వాగతించింది. జి-20 అనేది ఆర్థిక సహకారానికి సంబంధించిన వేదిక, అంతేగానీ భౌగోళిక, రాజకీయ, భద్రతా సమస్యలను పరిష్కరించేందుకు ఒక వేదిక కాదని పేర్కొంటున్న న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను స్వాగతిస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. శనివారం ప్రకటించిన బృహత్తర ప్రాజెక్టు భారత్‌-మధ్య ప్రాచ్యం-యూరప్‌ ఆర్థిక కారిడార్‌ (ఐఎంఇసి)ను కూడా చైనా స్వాగతించింది. ఇది భౌగోళిక, రాజకీయ సాధనంగా మారరాదని సూచించింది. ''వర్ధమాన దేశాలు మౌలిక సదుపాయాలను నిర్మించుకునేందుకు వాస్తవంగా సాయపడే, అనుసంథానతను, ఉమ్మడి అభివృద్ధిని పెంచి పోషించే అన్ని చొరవలనూ చైనా స్వాగతిస్తుంది.'' అని చైనా విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. అదే సమయంలో ఇటువంటి వివిధ అనుసంథాన చొరవలనేవి పారదర్శకంగా, అందరినీ కలుపుకుని పోయేలా వుండాలి తప్పితే భౌగోళిక, రాజకీయ సమస్యలను పరిష్కరించుకునే సాధనాలుగా మారరాదని సూచించింది. జి-20 సభ్య దేశాల ఉమ్మడి అవగాహనను ప్రతిబింబించేలా, చర్చల ద్వారా సాధించిన ఏకాభిప్రాయాన్ని ప్రదర్శించేలా జి-20 నేతల డిక్లరేషన్‌ వుందని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి సంబంధించిన ప్రధాన వేదికగానే జి-20 వుండాలి కానీ భౌగోళిక, రాజకీయ, భద్రతాపరమైన సమస్యలను పరిష్కరించుకునే సాధనంగా మారరాదని మావో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి రాజకీయ పరిష్కారం కోసం అంతర్జాతీయ సమాజంలో కలిసి పని చేయడానికి, శాంతి చర్చలు పెంపొందించడానికి చైనా ఎప్పుడూ కట్టుబడి వుంటుందని చెప్పారు.