ప్రజాశక్తి-కాకినాడ : అధికారంలోకి వచ్చిన వారం రోజులలో సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ విధానాన్ని పునరుద్ధరణ చేస్తామని ఆనాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సిపిఎస్ ఉద్యోగులు స్థానిక ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏజీ కృష్ణ అధ్యక్షత వహించగా చింతా నారాయణమూర్తి, బాషా, ఎంఏ అలీం లు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి ఆర్ రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాపించిన పిలుపుమేరకు 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల వద్ద శనివారం ప్రతిఘటన ధర్నా పేరుతో సిపిఎస్ రద్దు చేయాలని ఓ పి ఎస్ ను పునరుద్ధరించాలని నిరసన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగా తమకు ఆనాడు ఇచ్చిన హామీని అమలు చేయకపోగా సిపిఎస్ విధానం కంటే దారుణమైన గ్యారెంటీ పెన్షన్ పేరుతో జిపిఎస్ విధానం అమలు చేయాలని చూడడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి జగన్ వై నాట్ 175 అని పిలిపిస్తున్నారని దానిలో భాగంగానే తాము కూడా వై నాట్ ఓపిఎస్ అని పిలిపినివ్వడం జరుగుతుందన్నారు. ఓ పి ఎస్ పునరుద్ధరించే వరకు నిరసన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని ఎప్పటికైనా సిపిఎస్ ను రద్దుచేసి ఓ పి ఎస్ ను పునరుద్ధరించడం తప్పదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి సిపిఎస్ ను రద్దుచేసి ఓ పి ఎస్ ను పునరుద్ధరణ చేసి తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జయరాం, సిపిఎస్ నాయకులు బండారు నారాయణ, పివి గోపాల్, పిఆర్టియు జిల్లా అధ్యక్షులు ప్రదీప్, ఏపీ యూఎస్ జిల్లా అధ్యక్షులు చలపతి, ఆర్ యు పిపి నాయకులు పల్లంరాజు, మెడికల్ ఎంప్లాయిస్ జిల్లా నాయకులు డీఏ రాజు, ఫ్యాఫ్టో తో జిల్లా నాయకులు, బంగార్రాజు, మురళి కృష్ణ, చిన్న బాబు, వెంకటేశ్, రమేష్, వెంకటలక్ష్మి, భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.










