
- ఈఈకి వినతిపత్రం అందజేసిన మాజీ మంత్రులు ఆనందబాబు ఆలపాటి
ప్రజాశక్తి-తెనాలి(గుంటూరు) : సాగునీరు అందక రైతులు నానా అవస్థలు పడుతున్నారని, ఇరిగేషన్ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు, మాజీ మంత్రి అలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. స్థానిక కృష్ణ పశ్చిమ డెల్టా ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద రైతులతో కలిసి సాగునీటి విడుదలపై బుధవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీటి విడుదలలో అలసత్వం తగదని, పంటలు ఎండిపోతున్నాయని, రైతుల అవస్థలను దృష్టిలో పెట్టుకొని, పంటలకు సరిపడా సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ ఈఈ ఎస్ మల్లికార్జున కు పరిస్థితిని వివరించారు. అదే సమయంలో ఇరిగేషన్ ఎస్ఈతో ఫోనులో సంప్రదించి రైతుల ఇబ్బందులను వివరించారు. సమస్యలపై ఈఈ కి వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో తెనాలి, వేమూరు నియోజకవర్గాలకు చెందిన రైతులు, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు .