ప్రజాశక్తి-కాకినాడ : రైత్వారీ పట్టాలు కొఱకు ఎన్నో తరాలుగా ఎదురుచూస్తున్నామని ఇంకెన్ని తరాలు ఎదురుచూడాలని చింతలూరు రైతుల చింత తీరేదెన్నడని చింతలూరు రైత్వారీ హక్కుల సాధన కమిటీ ప్రశ్నించింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం చింతలూరు గ్రామ రైతులు రైత్వారీ పట్టాలు పంపిణీ కోరుతూ సోమవారం కాకినాడ కలెక్టర్ వద్ద సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు బుగతా బంగార్రాజు మాట్లాడుతూ జమీందారి రద్దు చట్టం వచ్చి 75సంవత్సరాలు, ఇనాం రద్దు చట్టం వచ్చి 65సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ చింతలూరు రైతులకు వ్యవసాయ కూలీలకు నేటికీ రైత్వారీ పట్టాలు రాలేదన్నారు. ఇవి ఇనాం భూమిలని రెవిన్యూ అధికారులు నిర్ధారించినా గత మూడు తరాలుగా చింతలూరు రైతులు పట్టాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. 1700క్లయిములు రైతులు దాఖలు చేసినా అధికారులు పట్టనట్లు ఉన్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాగులో ఉన్న రైతుకూలీలకు రైత్వారీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రత్తిపాడులో నిరసన ప్రదర్శనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కర్నాసుల వీరంజనేయులు, రైతు కూలీలు గ్రామస్తులు పాల్గొన్నారు.










