ప్రజాశక్తి-రాయదుర్గం : కావలిలో ఏపీఎస్ఆర్టీసీ ఆటోనగర్ డిపో డ్రైవర్ బత్తుల రాంసింగ్ పై కొందరు దుండగులు గత 26న అమానుసంగా జరిపిన దాడిని ఖండిస్తూ, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాయదుర్గం డిపో నందు ఆదివారం ఉదయం 5.00 గంటల మొదటి సర్వీసు నుండి ఎన్ ఎం యు ఏ సభ్యులు, ఉద్యోగులు "నల్ల బ్యాడ్జీలు" ధరించి విధులకు హాజరైనారు. డ్రైవర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ, డ్రైవర్ కు సంఘీభావం తెలుపుతూ, నిరంతరం ప్రజల మధ్య విధులు నిర్వహించే ఆర్టీసీ ఉద్యోగుల పట్ల దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ధాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపారు. దాడి చేసిన అల్లరిమూకల పైన కఠినమైనచర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి హెచ్ టి స్వామి మరియు ఉద్యోగులు వేణుగోపాల్, రామచంద్ర, మైలారప్ప, రామాంజనేయులు, శివుడు, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.