Jul 28,2023 16:46

ప్రజాశక్తి - తాళ్లరేవు : మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసకాండకు వ్యతిరేకంగా సీఐటీయూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం నుంచి తాళ్ళరేవు మెయిన్ రోడ్డుపై చెరువుగట్టు సెంటర్ వరకు ర్యాలీ చేశారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించి కొద్దిసేపు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడారు. మణిపూర్ లో నేటికీ జరుగుతున్న హింసకాండను అదుపు చేయలేని బిజెపి పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఇంటర్నెట్ సైతం కట్ చేసి ప్రజల స్వేచ్ఛ హక్కును హరించడం అప్రజాస్వామికమన్నారు. స్త్రీలను వివస్త్రను చేసి అత్యాచారం చేయడం పట్ల భారతదేశంలో ఉన్న అన్ని పత్రికలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయన్నారు. హిందూ మతోన్మాదంతో ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, గిరిజనులపై దాడుల చేస్తూ దుర్మార్గమైన మారణకాండకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మణిపూర్ ఘటనపై పార్లమెంటులో చర్చించడానికి అవకాశం ఇవ్వని ప్రధాని నరేంద్ర మోడీ చర్యలను యావత్ ప్రపంచం గమనిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా స్త్రీలను  వివస్త్రలను చేసిన ఘటన పైన, 150 మంది మరణానికి కారణమైన మతోన్మాద శక్తులను ఉరి తీయాలి అని మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున నినదించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా సంఘం నాయకులు కమిడి ఈశ్వరి బాయి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు పిల్లి వెంకటలక్ష్మి, పద్మజ, సిఐటియు, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు అనంతలక్ష్మీ, నాగలక్ష్మి, ఎంపీటీసీ పోతుల రత్నకుమారి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దుప్పి అదృష్ట  దీపుడు, తణుకు రాజు తదితరులు పాల్గొన్నారు.