- మద్దతు తెలిపిన ఉపాధ్యాయ సంఘాలు
ప్రజాశక్తి కర్నూలు కలెక్టరేట్ : రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలని సిపిఎస్ ఉద్యోగ సంఘం నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా సిపిఎస్ ను రద్దు చేయాలన్నారు. శనివారం కలెక్టరేట్ ఎదుట సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఫ్యాప్టో జాక్టో పోర్టో ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి. యుటిఎఫ్ కర్నూల్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శులు జయరాజు సుధాకర్ జిల్లా సహాధ్యక్షుడు రవికుమార్ ఆర్థిక కార్యదర్శి హేమంత్ కుమార్ జిల్లా కార్యదర్శి నవీన్ పాటి బాబు సిఐటియు ఓల్డ్ సిటీ సెక్రెటరీ విజయ్ ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియానందం ఇస్మాయిల్ ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగన్న లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు సిపిఎస్ స్థానంలో జిపిఎస్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. సిపిఎస్ జిపిఎస్ రెండు విధానాలు ఉద్యోగ ఉపాధ్యాయులకు నష్టదాయకమేనన్నారు. ఈ రెండు విధానాలను వెంటనే ఉపసంహరించుకొని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు కోసం జరిగే పోరాటానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి రమణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు రమణ ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.










