ప్రజాశక్తి-పెద్దాపురం(కాకినాడ): మణిపూర్‌లో మూడు నెలలుగా మారణకాండ జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనంగా ఉండడాన్ని నిరసిస్తూ సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక మున్సిపల్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు దాడి బేబీ, సిరపరపు శ్రీనివాస్, చింతల సత్యనారాయణలు మాట్లాడుతూ.. మణిపూర్‌లో గత 80 రోజులు పైగా ఘోరమైన హింస జరుగుతున్నా ప్రధాని మోడీ మౌనం పాటించటం అన్యాయమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వంటి మతోన్మాద సంస్థలు పథకం ప్రకారమే దేశంలో మత చిచ్చు రగిలిస్తున్నాయన్నారు. ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు, హత్యలు ప్రపంచ మానవాళిని కదిలించాయన్నారు.ఈ మారణకాండకు చింతించవలసింది పోయి బిజెపి సంస్థలు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు, గూనూరు రమణ,వడ్డి సత్యనారాయణ,సావిత్రి, సత్యవేణి, నాగమణి,సాయి లక్ష్మి,తైనాల శ్రీను,జి సత్యనారాయణ, డి.కష్ణ,పెంటయ్య,అప్పన్న,నరసింహమూర్తి, మాగాపు నాగు, డి.సత్యవతి, యాసలపు రమేష్, చల్లా విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.










