Jun 21,2022 06:22

త్రివిధ దళాల్లో స్వల్పకాలిక తాత్కాలిక సైనికుల నియామకపు పథకం అగ్నిపథ్‌పై విద్యార్థి, యువత, యావత్‌ దేశం రగులుతున్నా మోడీ ప్రభుత్వం మొండిగా ముందుకేనంటున్నది. ఆర్మీలో 'అగ్ని వీరుల' రిక్రూట్‌మెంట్‌కు సోమవారం నోటిఫికేషన్‌ ఇచ్చింది. జులై నుండి అభ్యర్ధుల రిజిస్ట్రేషన్లు మొదలవుతాయని విధి విధానాలను ప్రకటించింది. సైన్యంలో నాలుగేళ్ల కాలపరిమితిపై 17-21 వయసు యువతను కాంట్రాక్టుపై నియమించి, నాలుగేళ్ల సర్వీస్‌ పూర్తయ్యాక 75 శాతం మందిని రిటైర్మెంట్‌ చేసే అగ్నిపథ్‌ స్కీంను గత మంగళవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదించగా, ఆ మరుక్షణమే దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. నిరసనలు పలు రాష్ట్రాలకు దావానలంలా వ్యాపిస్తున్నాయి. దేశ సేవ కోసం అంకితభావంతో సైన్యంలో చేరగోరు యువత తమ ఆశలపై నీళ్లు చల్లిన అగ్నిపథ్‌పై ఆందోళన చెందుతోంది. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా రోడ్లపైకి, రైల్వే స్టేషన్లపైకి దూసుకెళ్లి నిరసన తెలుపుతున్నారు. విచక్షణా రహితంగా పోలీస్‌ కాల్పులు, లాఠీఛార్జీలకు పాల్పడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన పోలీస్‌ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించవలసింది పోయి నిరసనకారులపై పోలీసులను ప్రయోగించడం దారుణం.
అగ్నిపథ్‌ అలజడుల విషయంలోనూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రతిపక్షాలపై రాజకీయ ఎదురుదాడిని వదిలిపెట్టలేదు. యుపిఎ ప్రభుత్వంలోనే పథకానికి బీజాలు పడ్డాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వంటి వారు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పూనుకోవడం ఆక్షేపణీయం. రాజ్యాంగాన్ని, వ్యవస్థలను తిరగదోడుతున్న బిజెపి ప్రభుత్వానికి కాంగ్రెస్‌ బీజాలు వేసిన పథకాన్ని నిలుపుదల చేసే శక్తి లేదని భావించగలమా? 2021 నాటికి ఆర్మీలో లక్షకుపైగా సైనికుల, అధికారుల కొరత ఉంది. రెండేళ్ల నుండి రిక్రూట్‌మెంట్‌ లేదు. దేశభక్తి గురించి జాతీయవాదం గురించి మాట్లాడే పేటెంట్‌ తమ స్వంతమని రంకెలు వేసే బిజెపి పెద్దలే కాంట్రాక్టు సిపాయిలను పెట్టుకొని సైన్యం నైపుణ్య సామర్ధ్యాలను నిర్వీర్యం చేయబూనడమంటే వారిది ముమ్మాటికీ నకిలీ జాతీయవాదం, నకిలీ దేశభక్తి అని చెప్పడానికి ఎటువంటి శషభిషలూ అవసరం లేదు. 'వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌' అనే బిజెపి నినాదానికి అగ్నిపథ్‌ పూర్తి వ్యతిరేకం. 2032 నాటికి సైన్యంలో 50 శాతం కాంట్రాక్టు సిపాయిలతో నింపడం మోడీ ప్రభుత్వ లక్ష్యం. ఈ చర్య సైన్యంపై ఉదారవాద విధానాల దాడి. రిటైరైన అగ్నిపథ్‌ సైనికులకు తాము ఉపాధి కల్పిస్తామన్న మహీంద్రా వంటి కార్పొరేట్‌ దిగ్గజాల మద్దతు అందుకే. ఇలాంటి వారు తమ ఆఫీసుల్లో ఒకరిద్దరికి సెక్యూర్టీ గార్డు ఉద్యోగాలిస్తారంతే! అత్యున్నత త్యాగాలు చేసేందుకు సిద్ధపడ్డ నవ జవాన్లకు ఇచ్చే బహుమానం ఇది.
అగ్నిపథ్‌పై వివిధ రాష్ట్రాల్లో పోరాటం తీవ్ర స్థాయికి చేరుకున్నా ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిడిపి నోరు మెదపకపోవడం వాటి బిజెపి అనుకూలతకు నిదర్శనం. పైగా నిరసనలు తెలుపుతున్న ఆర్మీ ఉద్యోగార్ధులపై అక్రమ నిర్బంధం ఆందోళనకరం. రైలులో ప్రయాణిస్తున్న అమాయకులైన 31 మందిపై గుంటూరు వద్ద కుట్ర కేసులు బనాయించి అరెస్టు చేసి రాత్రికి రాత్రి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించడం అన్యాయం. కనీసం నిరసన తెలిపే హక్కు కూడా ప్రజలకు లేదన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం తగదు. ఆర్మీ ఉద్యోగార్ధులైన నిరపరాధ యువకులపై కేసులను రద్దు చేసి, వెంటనే విడుదల చేయాలి. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తున్న వారిపై పలు బిజెపి రాష్ట్రాల్లో ఇలాంటి కేసులే పెడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కితే ఉద్యోగాలు రావని హెచ్చరిస్తు న్నారు. కేంద్ర ప్రభుత్వం బెదిరింపులు మాని సైన్యానికి రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌ విధానాన్ని చేపట్టాలి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలన్న బిజెపి ఎనిమిదేళ్లల్లో ఇచ్చింది శూన్యం. సిపాయి ఉద్యోగాలను కాంట్రాక్టీకరించడం సాయుధ బలగాల్లో వినాశకర ప్రయోగం. సమాజంలో ప్రతికూల ప్రభావానికి ఆస్కారం. తస్మాత్‌ జాగ్రత్త!