- ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్
- తరలివచ్చిన విద్యార్థి లోకం
- రెండోరోజుకు చేరిన సైకిల్‌యాత్ర
ప్రజాశక్తి -శృంగవరపుకోట : విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే సంగ్రామ యాత్ర సమరయాత్రగా మారుతుందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని పుణ్యగిరి కాలేజీ నుంచి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న విద్యార్థి సంగ్రామ సైకిల్‌యాత్ర మంగళవారం రెండోరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా పట్టణంలోని దేవి కూడలి వద్ద నిర్వహించిన బహిరంగ సభకు వందలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. ఈ సభలో ప్రసన్నకుమార్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డికి బటన్ నొక్కడంపై ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంపై లేదన్నారు. సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్థులు పరిస్థితి ఆధ్వానంగా మారిందని, విద్యార్థులకు చాలీ చాలని భోజనం పెడుతున్నారని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచి, వారి ఆకలి తీర్చాలని డిమాండ్ చేశారు. మరోపక్క ప్రభుత్వ విద్యను విద్యార్థులకు దూరం చేసే విధంగా మోడీ మీద ప్రేమతో జగన్ నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. దీనివల్ల రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం నాశనమవుతుందని మండిపడ్డారు. వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారని, దానిలో భాగంగా జిఒ 77 తీసుకొచ్చి మొత్తం ఉన్నత విద్యకు మంగళం పాడేశారన్నారు. డిగ్రీలో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ విధానాన్ని విద్యార్థుల స్థాయికి, సిలబస్‌కు అనుగుణంగా పెట్టాలని కోరారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలకు సొంత భవనాలను నిర్మించి, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందించాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి రామ్మోహన్ రావు మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి నిర్వహిస్తున్న సంగ్రామ సైకిల్ యాత్రను విద్యార్థులు ప్రజలు ఆదరిస్తున్నారని. ఇప్పటికైనా సమస్యల పరిష్కారం కోసం పాలకులు, అధికారులు కృషి చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చినబాబు, ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు.