Jul 06,2023 06:53
  • రూ.6 వేలు నుంచి రూ.20వేలు వరకు వసూలు
  • అచేతనంగా అధికారులు
  • పట్టించుకోని ప్రభుత్వం
  • విద్యార్థుల తల్లిదండ్రులపై పెనుభారం

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లలో పాఠ్యపుస్తకాల భారం విద్యార్థుల తల్లిదండ్రుల పాలిట పెనుభారంగా మారింది. ప్రభుత్వం ముంద్రించిన పాఠ్యపుస్తకాలను కొనుగోలు చేయడం లేదు సరికదా, ప్రైవేటు పబ్లిషర్స్‌ నుంచి తెచ్చుకున్న పుస్తకాల ధరలు నాలుగింతలు పెంచి విక్రయిస్తున్నారు. నారాయణ, చైతన్య వంటి స్కూళ్లలో అయితే మరీ దారణంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలలో 1 నుంచి 10 తరగతి విద్యార్థుల నుంచి పుస్తకాల కోసం రూ.6వేలు నుంచి రూ.20వేలు వరకు వసూలు చేయడం గమనార్హం.
జిల్లాలో రైషనలైజేషన్‌ పేరిట చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలను ఎత్తివేసిన విషయం విధితమే. ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1805 వరకు ఉన్నాయి. వీటిలో 1,56,688 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లు 427 వరకు ఉన్నాయి. వీటిలో సుమారు 90వేల మంది వరకు చదువుతున్నారు. వాస్తవానికి అన్ని పాఠశాలల్లోనూ ప్రభుత్వం రూపొందించిన పుస్తకాలను భోదించాల్సి వుంది. ప్రభుత్వ పాఠశాలల వరకు ఇది అమలవుతున్నప్పటికీ ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను కొనుగోలు చేయడం లేదు. వీటిలోవున్న పాఠ్యాంశాలను కాస్త అటు ఇటుగా మార్పులుచేసి, ఆమేరకు పేజీలు పెంచి ప్రైవేటు పబ్లిషర్స్‌ ముద్రించిన పుస్తకాలను ఇక్కడ బోధిస్తున్నారు. వీటికి వర్కుబుక్స్‌, నోట్‌బుక్స్‌ వంటివి జత చేసి భారీ మొత్తానికి విక్రయిస్తున్నాయి. దీనికి తోడు పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు తమ వద్దే కొనాలని మెలికపెట్టడంతో వాటిని కొనుగోలు చేయడానికి తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. ముఖ్యంగా నారాయణ, చైతన్య తదితర కార్పొరేట్‌ స్కూళ్లలో 1వ తరగతి నుంచి 10వ తరగతి లోపుగల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలకు రూ.20వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇవి కాకుండా యూనిఫారాలు కూడా బయట కొనుక్కోవడానికి వీలు లేదు. వాస్తవానికి ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సరిపడిన పుస్తకాలను ప్రభుత్వమే ముద్రించింది. సరిపడినంత మేరకు జిల్లాలకు విరివిరిగా కేటాయించింది. ప్రైవేటు పాఠశాలలు కేవలం పుస్తకాల విలువపై 5శాతం చెల్లించి ఆర్డర్స్‌ ఇవ్వడానికే పరిమితమయ్యాయి. వీటిని ప్రైవేటు యాజమాన్యాలు కొనుగోలు చేసి, విద్యార్థులకు ఇవ్వడానికి రూ.700 నుంచి రూ.1000లోపే సరిపోతుంది. పుస్తకాల్లోనూ కక్కుర్తిపడ్డ యాజమాన్యాలు నిబంధనలు తుంగలో తొక్కుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల బోధన మాత్రమే చేయాలన్న నిబంధనను అధికారులు పట్టించుకోవడం లేదు. పుస్తకాలపై బాదుడును అధికారులు అరికట్టలేక అచేతనంగా ఉన్నారు.

  • తల్లిదండ్రులే ప్రశ్నించాలి

పుస్తకాలకు అధిక మొత్తంలో చెల్లించాల్సిన అవసరం లేదు. అధిక వసూళ్లపై తల్లిదండ్రులే ప్రశ్నించాలి. వారు ప్రశ్నించకుండా తామేమీ చేయలేం. ప్రభుత్వ స్కూళ్లలో అయితే పాఠ్యపుస్తకాలన్నీ ఉచితంగానే పంపిణీ చేస్తున్నాం. అందుకే ప్రభుత్వ స్కూళ్లలో చదివించుకోవాలి.
- బి.లింగేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి