Jun 20,2023 09:17

న్యూఢిల్లీ : అక్బర్‌, ఔరంగజేబులపై రూపొందించిన చాప్టర్లను ఎన్‌సిఇఆర్‌టి పాఠ్య పుస్తకాల నుండి తొలగించడం ముస్లిములను సమాజం నుండి తెరమరుగుచేసే ప్రయత్నమేనని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌, చరిత్రకారిణి తనికా సర్కార్‌ అభిప్రాయపడ్డారు. ముస్లిం పేరు ఎక్కడ ఉన్నా దానిని తొలగిస్తున్నారని, ఆ సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని హత్యాకాండకు పాల్పడుతున్నారని విమర్శించారు. భారతీయ రాజకీయ, సాంస్కృతిక జీవనం నుంచి ముస్లింల భాగస్వామ్యాన్ని పాఠ్య పుస్తకాల నుండి తొలగించడం ఆశ్చర్యమేమీ కాదని టెలిగ్రాఫ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.
         మధ్యయుగం నాటి ఇస్లామిక్‌ చరిత్ర పాఠ్య పుస్తకాల నుండి అదృశ్యమైపోయిందని సర్కార్‌ వ్యాఖ్యానించారు. అక్బర్‌, జహంగీర్‌లు ఇతర మతాల విశ్వాసాలను గౌరవించారని గుర్తు చేశారు. భారతీయ చరిత్రలో హిందూ విజయాలు మాత్రమే కన్పించాలని హిందూత్వవాదులు కోరుకుంటున్నారని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు 38 అనుబంధ సంస్థలు ఉన్నాయని, అందులో బిజెపి ఒకటని తెలిపారు. ఆ సంస్థలు చరిత్రల్ని సృష్టించి, వాటిని తమ అనుబంధ విభాగాల ద్వారా ప్రచారం చేస్తుంటాయని అన్నారు. ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాలలో మార్పులు ఇప్పుడే ప్రారంభమయ్యాయని, మున్ముందు మరెన్నో చరిత్రలను తిరగరాస్తారని చెప్పారు. ఇదంతా వారి అజెండాలో భాగమేనని అన్నారు. ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలలోని భారతీయేతర చారిత్రక సమాచారాన్ని కూడా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
          హక్కులు, న్యాయం కోసం జరిగిన విప్లవాలు, ఆందోళనల చరిత్రను కూడా తొలగిస్తున్నారని సర్కార్‌ చెప్పారు. సానుకూల చారిత్రక విలువలను ధ్వంసం చేయడం, ఆధునిక రాజకీయాలలో కీలక భాగాలుగా ఉన్న కొన్ని విలువలను సైతం కనుమరుగు చేయడం ఈ చర్యల ఉద్దేశమని వివరించారు. గాంధీని హత్య చేసిన వ్యక్తి కులం, సిద్ధాంతం గురించి బయటపెట్టడం వారికి ఇష్టం లేదని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. అదే ముస్లింలను అయితే వేలెత్తి చూపుతారని అన్నారు. గుజరాత్‌ హింసాకాండ గురించి మాట్లాడుతూ బిబిసి డాక్యుమెంటరీలో చూపిన వాస్తవాలను, వాటిని ప్రదర్శించిన విద్యార్థులకు విధించిన శిక్షను ప్రస్తావించారు. పాఠ్యాంశాలలో మార్పులపై రచయితలను, సంపాదకులను సంప్రదించామన్న ఎన్‌సిఇఆర్‌టి వాదనపై అడిగిన ప్రశ్నకు సర్కార్‌ జవాబిస్తూ సహజంగా ఇలాంటి పనులు రహస్యంగా జరుగుతాయని, ఒకవేళ సంప్రదింపులే జరిగి ఉంటే ఈ మార్పులు ఎందుకు అవసరమో చెప్పాల్సి ఉందని అన్నారు.