
అనేక కార్పొరేట్, ప్రయివేటు పాఠశాలలు మూడవ తరగతి నుంచే ఐ.ఐ.టి ఫౌండేషన్ కోర్సు ప్రారంభి స్తున్నాయి. పాఠ్యపుస్తకాలకు తోడు, నోటుబుక్స్, స్టడీ మెటీరియల్, వాటర్ బాటిల్ వంటి ఇతరత్రా సామాగ్రి కలిపి విద్యార్థి బరువు కంటే పుస్తకాల బరువు ఎక్కువగా ఉంటున్నది. అధిక బరువున్న బ్యాగులను పిల్లలు మోయడం వల్ల వారికి మెడ నొప్పి, వెన్ను నొప్పి వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు అధిక హోమ్‌వర్క్ ఇవ్వడం వల్ల కూడా విద్యార్థులు పలు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల పుస్తకాల బరువు తగ్గించాలని యశ్‌పాల్ కమిటీ తెలిపింది. యూరప్ దేశాల్లో పిల్లల బరువులో పది శాతానికి మించి పుస్తకాల బరువుకు అనుమతి లేదు. అమెరికా, కెనడా, సౌదీ అరేబియా వంటి దేశాల్లో పది నుంచి పదిహేను శాతం వరకు మాత్రమే పిల్లల బరువులో పుస్తకాల బరువు ఉండేటట్లు నిబంధనలు ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా నూతన విద్యా విధానాన్ని అనుసరించి స్కూలు బ్యాగ్ విధానాన్ని రూపొందించింది. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్కూలు బ్యాగ్‌కు సంబంధించి కొన్ని నిబంధనలను రూపొందించింది.
ఈ మేరకు 'స్కూల్ బ్యాగ్ పాలసీ-2020' అమలుకు పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. జాతీయ విద్యా విధానం, మానవ వనరుల మంత్రిత్వ శాఖ సూచనలకు అనుగుణంగా పిల్లల బ్యాగ్ ఎంత బరువు ఉండాలనే దానిపై నిబంధనలు రూపొందించింది. తాజా నిబంధనల ప్రకారం ప్రతి స్కూలూ.. టైంటేబుల్ తయారుచేసుకుని, వీలైనంత మేర బ్యాగ్‌ల బరువును తగ్గించే ప్రయత్నం చేయాలి. పిల్లలకు ఎక్కువ గంటల చదువు కంటే సులభంగా నేర్చుకునేలా 'ఎక్స్‌పీరి యన్షియల్ లెర్నింగ్' అమలుచేయాలి. పుస్తకాలతో అవసరం లేకుండా అందుబాటులో ఉండే మెటీరియల్‌తో ప్రాజెక్టు వర్కులు చేయించాలి. 1, 2 తరగతుల విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వకూడదు. 3 నుంచి 5 తరగతుల పిల్లలకు నేరుగా వర్క్‌బుక్‌లోనే హోంవర్క్ రాసి పాఠశాలల్లోనే టీచర్లకు ఇవ్వాలి. 6 నుంచి 10 తరగతులకు కూడా ఈ విధానమే ఉండాలి. విద్యార్థులకు రోజువారీ నిర్దేశించిన సబ్జెక్టులకే హోంవర్క్ ఇవ్వాలి. ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు రోజూ ఒక గణితం పుస్తకం, ఇతర సబ్జెక్టుల్లో ఒక పుస్తకం తెచ్చుకునే విధానం అమలుచేయాలి. టీచర్లు ఏ సబ్జెక్టు బోధిస్తారో ముందుగానే నిర్ణయించి, ఆ రోజుకు ఆ పుస్తకాలను మాత్రమే తెచ్చే విధానం పిల్లలకు అలవాటుగా మారేలా చేయాలి. విద్యార్థులు సెమిస్టర్ల వారీగానే పుస్తకాలు తెచ్చుకోవాలి. వీలైన చోట్ల పాఠశాలల్లోనే విద్యార్థుల పుస్తకాలు ఉంచుకునేలా బాక్సులు, షెల్ఫ్‌లను ఏర్పాటు చేయలి. వీలైతే వర్క్‌బుక్‌లు, అసైన్‌మెంట్లు, డిక్షనరీలు, రిఫరెన్స్ పుస్తకాలు, ప్రాక్టీస్ మెటీరియల్ లాంటివి పాఠశాలల్లోనే ఉండే ఏర్పాట్లు చేయాలి. అలాగే నెలలో రెండు శనివారాలు 1 నుండి 8వ తరగతి విద్యార్థులకు నో స్కూల్ బ్యాగ్ డే నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానం బాగానే అమలు చేయబడుతుంది. కార్పొరేట్ పాఠశాలల వారికి సొంత విద్యా ప్రణాళికలు ఉంటాయి. వారు ప్రభుత్వ ఉత్తర్వులను పెద్దగా పట్టించుకున్నట్లు ఎక్కడా కని పించదు. బ్యాగుల బరువు, హోంవర్క్ వంటివి అధికంగా వుండడం వల్ల చిన్నారులు తమ బాల్యంలో పొందే ఆనం దానికి దూరం అవుతున్నారు. విద్యా శాఖ ఉత్తర్వులను వివిధ పాఠశాలలు తప్పకుండా పాటించాలి. లేదంటే అధిక బరువు మోస్తూ బడికొచ్చే బాల కార్మికులుగా నేటి తరం పిల్లలు మారే ప్రమాదం ఉంది.
- యం. రాంప్రదీప్, సెల్ : 9492712836