Aug 28,2023 22:42

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ స్మారకంగా ముద్రించిన వంద రూపాయల నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌ లో ఎన్‌టిఆర్‌ శత జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్‌టిఆర్‌ కుమార్తెలు లోకేశ్వరి, పురందేశ్వరి, భూవనేశ్వరి, కుమారులు మోహన్‌ కృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో కలిసి రాష్ట్రపతి స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్‌టిఆర్‌ తన నటనతో సామాన్యుల బాధను కూడా వ్యక్తం చేశారని ఆమె పేర్కొన్నారు. 'మనుషులంతా ఒక్కటే' అనే సినిమాతో సామాజిక న్యాయం, సమానత్వమనే సందేశాన్ని ఎన్‌టిఆర్‌ వినిపించారన్నారు. తెలుగు సినిమాలతో భారతీయ సినిమా, సంసృతిని సుసంపన్నం చేశారన్నారు. ప్రజాసేవకుడిగా, నాయకుడిగా ఎన్‌టిఆర్‌కు అంతేస్థాయిలో ఆదరణ ఉందని చెప్పారు. తన అసాధారణ వ్యక్తిత్వం, కృషితో దేశ రాజకీయాల్లో అద్వితీయమైన అధ్యాయాన్ని సృష్టించారని చెప్పారు. ఎన్‌టిఆర్‌ ప్రారంభించిన అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నేటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఎన్‌టిఆర్‌ స్మారక నాణెం తీసుకొచ్చినందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను రాష్ట్రపతి అభినందించారు. ఎన్‌టిఆర్‌ అద్వితీయమైన వ్యక్తిత్వం తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పుడూ ముద్రితమై ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎంపిలు రఘురామ కృష్ణరాజు, కనకమేడల రవీంద్ర కుమార్‌, గల్లా జయదేవ్‌, ఎన్‌టిఆర్‌ కుటుంబ సభ్యులు, టిడిపి నేతలు హాజరయ్యారు. యువగళం పాదయాత్రలో ఉన్నందున లోకేష్‌, అలాగే ఇతర కారణాలతో ఆయన భార్యా బ్రహ్మణి, సినీ నటులు జూనియర్‌ ఎన్‌టిఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ తదితరులు గైర్హాజరు అయ్యారు. ఈ సందర్భంగా బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పక్కపక్కనే కూర్చునే సుదీర్ఘంగా చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది. దేశ రాజకీయాలతో పాటు, ఏపి రాజకీయాలపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగినట్టు సమాచారం

వెబ్‌సైట్‌లో ఎన్‌టిఆర్‌ స్మారక నాణేం

ఎన్‌టి రామారావు స్మారక నాణేం వెబ్‌సైట్‌లో లభిస్తుందని హైదరాబాద్‌ మింట్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ విఎన్‌ఆర్‌ నాయుడు ప్రకటించారు. అలాగే హైదరాబాదులోని మింట్‌ కార్యాలయంలో కూడా దొరుకుతుందన్నారు. ఎన్‌టిఆర్‌ స్మారక నాణేం 12 వేల కాయిన్స్‌ ఇప్పటి వరకు ముద్రణ వేశామని చెప్పారు. రూ.100 నాణాన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్‌, 5 శాతం జింక్‌తో తయారుచేసినట్లు వెల్లడించారు.