
న్యూఢిల్లీ : చట్టసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు కేటాయించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ 106వ సవరణ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ నెల 28న బిల్లుపై సంతకం చేసినట్లు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ (106 సవరణ) చట్టంగా రూపం దాల్చింది. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు (33 శాతం) సీట్లు రిజర్వుకానున్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొనబోయే లేదా ఆ తర్వాత నిర్ణయించే తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది. అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా ఈ బిల్లు చట్టరూపం దాల్చినా మహిళా రిజర్వేషన్ ఎప్పటి నుంచి అమలవుతుందన్న సందిగ్ధత నెలకొనివుంది. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాతే మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుందని కేంద్రప్రభుత్వం ఈ బిల్లులో పొందుపరచడమే సందిగ్ధతకు కారణం. జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సివుంది. కోవిడ్ కారణంగా 2021 జనాభా లెక్కలు వాయిదా వేయడంతో ఈ విషయంలో ఇప్పటికీ గందరగోళం నెలకొన్న సంగతి విదితమే. 2024లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాభా గణన ప్రక్రియ మళ్లీ ప్రారంభమైనా, అది పూర్తి కావడానికి కనీసం రెండు మూడేళ్లు సమయం పడుతుంది. నియోజకవర్గాల పునర్విభజన కూడా ఏళ్ల తరబడి జరిగే ప్రక్రియ. అందువల్ల మహిళా రిజర్వేషన్ చట్టం రూపం దాల్చినా అమలు కోసం 2029 ఎన్నికల వరకూ వేచిచూడాలి. 'నారీశక్తి వందన్ ఆదినియమ్' పేరిట రూపొందించిన ఈ బిల్లును ఇటీవల నిర్వహించిన ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఉభయ సభలూ ఆమోదించిన సంగతి తెలిసిందే. మహిళా రిజర్వేషన్ పట్ల బిజెపికి చిత్తశుద్ధి లేదని, అందుకే బిల్లులో అనేక ఆంక్షలు పెట్టారంటూ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాల సభ్యులు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మహిళా బిల్లును తక్షణమే అమల్లోకి తీసుకురావాలని, ఇతర వెనుకబడిన తరగతులకు (ఒబిసి) రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. వీటిలో ఏ డిమాండ్‌కూ బిజెపి ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా రాలేదు.