Aug 31,2023 07:05
  •  రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిపిఐ బృందం వినతి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 'మణిపూర్‌ పరిస్థితిని సానుభూతితో చూస్తారని, మణిపూర్‌ రాష్ట్రంలో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పేందుకు మీ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని సిపిఐ ఆశిస్తోంది. మణిపూర్‌ ప్రజలు సమాజంలోని విభజనల బాధితులు, ఒక రాజకీయ చొరవ, చర్చలు మణిపూర్‌ను పునర్నిర్మించడానికి, ప్రజలకు అవసరమైన విశ్వాసాన్ని ఇస్తుంది' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిపిఐ బృందం విజ్ఞప్తి చేసింది. ఆగస్టు 21 నుంచి 24 వరకు నాలుగు రోజులపాటు మణిపూర్‌లో సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా నేతృత్వంలో బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నరుతో భేటీ అయ్యారు. కుకీ, మైతీ బాధితుల సహాయ శిబిరాలను సందర్శించారు. అలాగే వివిధ రాజకీయ పార్టీల నేతలు, వివిధ వర్గాల నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజాతోపాటు జాతీయ కౌన్సిల్‌ కార్యదర్శులు బినోరు విశ్వం (ఎంపి), కె నారాయణ, రామకృష్ణ పాండాతో కూడిన సిపిఐ ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం సమర్పించారు. కుకీలు, నాగాలు, మైతీలు ఏ వర్గం వారు వారి ప్రాంతాల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఇంఫాల్‌లో గుర్తుపట్టలేని మృతదేహాలు 250 నుంచి 300 వరకు ఉన్నాయని అన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ.. మణిపూర్‌లో పరిస్థితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని, మణిపూర్‌ ముఖ్యమంత్రిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మణిపూర్‌లో పర్యటించాలన్నారు. అటవీ సంరక్షణ బిల్లుపై సంతకం పెట్టవద్దని ద్రౌపది ముర్ముని కోరామన్నారు. చంద్రయాన్‌ దిగిన ప్రాంతానికి శివశక్తి అని ఒక మతానికి సంబందించిన పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. 2014కు ముందు గ్యాస్‌ ధర ఎంత ఉందో అంతకు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. బిజెపికి వైసిపి అనుకూలంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఎపిలో సిపిఎం, సిపిఐ, టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తే మంచిదని, బిజెపి, వైసిపి డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ విఫలం చెందుతుందన్నారు. అవినాష్‌ రెడ్డి, కవిత జైలుకు వెళ్లకుండా ఉండటానికి బిజెపి, వైసిపి, బిఆర్‌ఎస్‌ మధ్య ఒప్పందాలు జరిగాయన్నారు. కొండపైన లిక్కర్‌ నిషేధముందని, కానీ లిక్కర్‌ అమ్మేవాడిని టిటిడి బోర్డు సభ్యుడిగా పెట్టారని ఎద్దేవా చేశారు. రెండు రాష్ట్రాల్లో బిజెపికి స్థానాలు లేకపోయినా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంలో బిజెపికి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. బిజెపి వల్ల రెండు రాష్ట్రాల ప్రజలకు నష్టం జరుగుతుందని అన్నారు. బిజెపితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించే వారికి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరుతున్నామన్నారు.