Jan 01,2023 08:47

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరానికి కూతవేటు దూరంలో గోదావరి చెంతనున్న పూలక్షేత్రం కడియం నర్సరీలు. నవంబర్‌ నెల రాగానే మంచు బిందువుల చుంబనంతో మొక్కలకు అందంగా పూలు విచ్చుకుని, సుగంధ వర్ణ శోభితాలై విరిసి, చూపరులను కట్టిపడేస్తాయి. ఈ సీజన్లో పిచ్చి మొక్క కూడా పువ్వుల సోయగాలు ఒలగబోస్తూ మనసుల్ని హత్తుకుంటుంది. ఆ విశేషాలేంటో ఈ వారం తెలుసుకుందాం.

1

అరచేతి పరిమాణంలో పొద్దుతిరుగుడు పువ్వుల్లా విప్పారిన డాలియా పూలు, అప్పటివరకూ ఆకులుగా ఉండి, చలిగాలి తగలగానే రంగురంగుల పూరేకలుగా మారిపోయే ఫాన్సీటియా మొక్కలు, పరిమళాలు వెదజల్లుతూ ఇంద్రధనస్సు మాలికల్లా కనుదోసే బంతులు, చామంతులు, వర్ణ వయ్యారాలతో ముచ్చట గొలిపే బోగన్విలియా (కాతం పువ్వుల మొక్కలు), గులాబీలు, అబ్బురపరిచే మినీ ఆస్టర్‌ పూలు, గాలిలో సైతం పెరగగలిగే ఆర్చిడ్స్‌, చిన్ని చిన్ని మొక్కలే అబ్బురంగా పూసే పీటోనియాలు, రంగులు విందు చేసే హైబ్రీడ్‌ విదేశీ లిల్లీలు, గజేనియాలు, గెలలు మాదిరిగా పెరిగే సాల్వియా, కోడిజుత్తులాంటి సెలోషియా, ఇంకా రోజ్‌, బిగోనియా, డయాంతస్‌, ఫైర్‌ బాల్‌ రెడ్‌, ఆల్మండాస్‌, రకరకాల మందారాలు, బ్లీడింగ్‌ హార్ట్‌, ప్యాసి ఫ్లోరా, జినియా, పెంటాస్‌, గుత్తి పూలు, మినీ ఎగ్జోరాస్‌, సంపంగెలు, కారోనియా, కోకాస్‌లాంటి పూలమొక్కలు దారి పొడుగునా స్వాగతం పలుకుతూ, మనసులను మైమరిపిస్తాయి. ఇవికాక ఫ్లుమేరియా, ఎడినం, కాక్టస్‌, నందివర్ధనం మినీ, గన్నేరు, కరివేరు లాంటి పూల మొక్కలు. చైనా బాక్స్‌, సంపెంగ, పారిజాతం, సన్నజాజులు, విరజాజులు, మల్టీకలర్‌ రోజాలు ఈ సీజన్లో ముఖ్యంగా పండుగలను పురస్కరించుకొని సుదూర ప్రాంతాల నుంచి సైతం వనప్రియలు కడియం నర్సరీలకు విచ్చేసి, పూల అందాలను తిలకించి, వాటి పరిమళాలను ఆస్వాదిస్తారు. పది రూపాయలు విలువ చేసే కరివేపాకు మొక్క నుంచి 20 లక్షల రూపాయలు విలువ చేసే విదేశీ మొక్కలు కూడా ఇక్కడ అందంగా కొలువుదీరతాయి. అడుగడుగునా మనల్ని నివ్వెరపరుస్తాయి. ఉసిరి, తులసి, కలబంద, మాది ఫలము, నిమ్మగడ్డి, లోని ఫలము, కోస్టస్‌ఇగస్‌ వంటి ఔషధ ఫలాలు ఆకర్షిస్తాయి.

2


పూల మకరందాన్ని సేవించడానికి వాటి చుట్టూ ప్రదక్షిణలు చేసే తుమ్మెద, తూనీగల ఝంకారనాదాలు చూసి తీరాలే తప్ప, చెప్పనలవి కానివి. నర్సరీలో పెద్ద పెద్ద చెట్లకు ఉన్న మధుర ఫలాలను ఆరగించడానికి విచ్చేసిన చిలుకలు, కోకిలలు, కొంగలు, వడ్రంగి పక్షులు, గోరింక పిట్టలు చేసే హడావిడి ఇంతా అంతా కాదు. నర్సరీల మధ్య నుంచి పాపిడి బొట్టులా పారే నీటి బోదుల్లో ఎగసిపడే చేప పిల్లల ఉరకలు ఎవరైనా తేరిపార చూడాల్సిందే. పూల మొక్కలే కాకుండా ఏళ్ల తరబడి వయసున్న మహావృక్షాలు, మరుగుజ్జు మొక్కలు, కుండీల్లో ఒదిగిపోయే వామన వృక్షాలు, ఇండోర్‌ మొక్కలు, ఆకులుగా అలరించే కోలియాస్‌ మరంటా పెయింటెడ్‌, ఆల్ట్రానంతర రాస్‌, సైకస్‌ పైకాస్‌, దురంత, పైసోనియా ఆల్బమ్‌, సైప్రెస్‌, బిస్మార్కియా సిల్వర్‌, ఫామ్స్‌ మొక్కలు, అకాలీఫా మొక్కలు ఎంతో నిగారింపుగా ఉంటాయి.

1


కుండీల్లోనే కాయలు కాసే మొక్కలు, కేజీ బరువుండే జామకాయలు, తియ్యగా ఉండే స్వీట్‌ లెమన్‌, 15 కేజీల బరువుండే పంపర పనస పండ్లు, ఇలా ఏది తిన్నా తీయగా అనిపించే మిరాకిల్‌ పండు, ఆరోగ్యానికి ఔషధంగా పనిచేసే లక్ష్మణ ఫలం, రామా ఫలం, సీతాఫలం, ఆంజనేయ ఫలం, అవకాడో, యాపిల్‌ రేగు, కివి పండు, కమలాలు, డ్రాగన్‌ ఫ్రూట్‌, ద్రాక్ష పళ్లు ఇలాంటివన్నీ కుండీల్లో కాస్తూ నర్సరీల్లో మనకు దర్శనమిస్తాయి. నర్సరీలను ఆనుకొని ఉన్న పూల తోటలు, బంతి, చామంతి, గులాబీ, కనకాంబరం, లిల్లీ, మల్లె, మందారం వంటి పూలతోటలు వందలాది ఎకరాల్లో విస్తరించి, ప్రకృతి ప్రేమికుల మనసులను కట్టిపడేస్తాయి.

2


- చిలుకూరి శ్రీనివాసరావు
8985945506