
ప్రజాశక్తి-తెనాలిరూరల్ : కొత్తపేట రామకృష్ణకవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న పద్య, సాంఘిక నాటిక పోటీలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. సోమవారం ఉదయం జయకళానికేతన్ విశాఖపట్నం వారి "శ్రీకాంత కృష్ణమాచార్య" పద్యనాటకం ప్రదర్శించారు. నాటిక ప్రధాన పాత్రధారి కె వెంకటేశ్వరరావు, వారి బృందం చేసిన నటన వీక్షకులకు కనువిందుచేసింది. పౌరాణిక ఇతిహాసంతో సాగిన పద్యనాటికలో ప్రతి సన్నివేశం శ్రోతలను ఆకట్టుకుంది. వీణ అవార్డ్స్ పేరిట కళలకాణాచి తెనాలి, వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ సంయుక్త నిర్వహణలో సాగుతున్న పోటీలు ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ పోటీలకు సినీ మాటలు రచయిత బుఱ్ఱా సాయి మాధవ్ సారధ్యం వహించడం నాటికలకు మరింత శోభ తెచ్చిపెడుతుంది. సూపర్ స్టార్ కృష్ణ మనుమడు, వర్ధమాన కథానాయకుడు అశోక్ గల్లా, దేవకి నందన వాసుదేవ సినిమా ఫేమ్ కథానాయిక మానస వారణాసి బహుమతి ప్రధానోత్సవానికి రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శనలో సోమవారం కళాంజలి హైదరాబాద్ వారి "జారుడు మెట్లు" ప్రత్యేక సాంఘిక నాటకం, విటిపిఎస్ కల్చరల్స్ అసోసియేషన్ ఇబ్రహీంపట్నం, విజయవాడ వారి "ఎనిమీ" సాంఘిక నాటిక గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి "మూల్యం" సాంఘిక నాటకలు ప్రదర్శిస్తారని తెలిపారు.