Oct 29,2023 08:25

కాలం పరిహసిస్తుంది
నీ వసంత వనం తుంచి
నాకు శిశిరం కట్టబెట్టానని!
విధి విర్రవీగుతోంది
నీ స్వర తంత్రుల తెంచి
నిశీధి నిశ్శబ్దం పరిచానని!
చితి జ్వాల వెక్కిరిస్తోంది
నీ అణువణువు దహించి
భస్మ ధూళి మిగిల్చానని!
గడ్డిపరక గర్వపడ్తోంది
మన నడుమ ఎడబాటు
జీవితకాలం పెంచానని!
మృత్యువు నవ్వుతోంది
నిష్కర్షగా నిను కబళించి
నన్ను ఒంటరిని చేశానని!
పాడు లోకం గర్విస్తోంది
ప్రేమానుబంధ సౌధాన్ని
నిలువునా కూల్చేశానని!
పాపం వాటికేం తెలుసు
నా ఊహల్లో ఉన్నావనీ..!
నా గుండెలో దాగున్నావనీ!
పాపం వాటికేం తెలుసు
నా హృదయ కోవెలలో
ప్రేమ దేవతై కొలువైనావనీ!
నా గుండె గొంతుకలో
ప్రణవనాదమై పల్లవిస్తావనీ!
నా జీవన యానంలో
వెన్నెల దీపమై ప్రజ్వలిస్తావనీ!


కోడిగూటి తిరుపతి
9573929493