యుద్ధం అంటే రక్తపుటేర్లు
యుద్ధ గెలుపంటే నెత్తుటికూడు
సమరం అంటే శవాల దిబ్బలు
సంగ్రామమంటే బతులన్నీ చావులే
కదనమంటే మరణ విధ్వంసాలు
పోరాటమంటే భూకంప తీరులు
ఆకాశహర్మ్యాలు క్షణాల్లో నేల మట్టాలు
జనసంద్ర జీవన అలలు కకావికలం !
త్రేతాయుగంలో స్త్రీ నిమిత్త యుద్ధం
ద్వాపరాన భూమి కోసం కురుక్షేత్రం
కలియుగాన కలహం అకా'రణం'
కమ్ముకున్న గగన యుద్ధమేఘాలు
భూతలాన ట్యాంకులు కవాతులు
సముద్రతలాలపై సబ్‌మెరైన్ల జోరులు !
మహోగ్ర యుద్ధ ఊచకోత ఎడారిలో..
శాంతి సంతోషాలన్నీ ఒయాసిస్సులే
సామూహిక హత్యాకాండ చరిత్రలు
సమర మోహాలు, రుధిర దాహాలు
నలుచెరగులా ఉన్మాద బుద్దులు
మదం పెనవేసుకున్న కిరాతకాలు
తల్లుల గర్భశోకాలు మిన్నంటే వైచిత్రి
ప్రళయ భీకర యుద్ధ ఘోషలు !
బతుకునిచ్చే, బతకనిచ్చే..
మానవత్వానికి దూరంగా..
చావు దిశగా ఈ చీకటి ప్రస్థానం
ఇంకెంత కాలం, ఎంత భారం
స్త్రీ వృద్ధ శిశువుల్ని చంపడం..
మహాపరాధం నాటి భారతం
నేడు యుద్ధనీతిని పాతరేయడం
మంచి మాటల నీతి పాఠాలన్నీ..
అయ్యాయి బధిర శంఖారావాలు
రణరంగం కానిచోటు దొరకదు
రక్తం తడిసిన కన్నీటి కదనాలు !
శాంతి అ నిత్యం, యుద్ధమే నిత్యం
యుద్ధ బులెట్ శాంతి పావురాన్ని..
పాశవికంగా హత్య చేస్తున్న వేళలు
నెత్తురోడుతున్న నేటి భూతలగడ్డ
శిథిలాల కింద శవాల గుట్టల్లోంచి,
నిరాశ్రయ నిస్సహాయ గొంతుల్లోంచి..
శవాల గుంపుల్లోంచి రోదిస్తున్న..
మానవ చరిత్ర సన్నని స్వరాలు !
యుద్ధోన్మాదానికి గజ 'గాజా'
సమరం శాశ్వతంగా తిష్ట వేస్తే..
శాంతి తొంగి చూసే అతిథి మాత్రమే
రణ క్షేత్రాలన్నీ రక్తంతో మెరిస్తే..
తక్కినవన్నీ కన్నీటితో తడుస్తాయి
యుద్ధంలో ఇరుపక్షాలు విజేతలే..
ఓడినోడు సర్వం కోల్పోయి ఏడిస్తే..
గెలిచినోడు చేసేదిలేక రోదించె..
ఇదే కదా డిజిటల్ యుగ యుద్ధనీతి
ఇదే కదా జ్ఞాన ధరిత్రి దీన చరిత్ర !
- మధుపాళీ, 9949700037