Dec 15,2022 07:12

ప్రధాని మోడీ ఉచితాల పేరుతో ప్రజాసంక్షేమ పథకాలపై దాడి చేయటం పెరిగింది. ఈ నెల 11న వివిధ పథకాలను ప్రారంభించటానికి మహారాష్ట్రకు వచ్చిన ప్రధాని నాగపూర్‌లోని ఎయిమ్స్‌ గ్రౌండ్‌లో జరిగిన సభలో ప్రసంగిస్తూ.. సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతున్న రాజకీయ పార్టీలపై తీవ్రమైన దాడి చేశాడు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష పార్టీలు అడ్డదారులు వెతుకుతున్నాయని, అడ్డదారుల్లో ప్రయత్నం చేస్తున్నవారు తమ వికృత రాజకీయాలతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆయన పేర్కొన్నాడు. ఇది పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయటమేనని, ఈ అడ్డదారులు తొక్కేవారు పన్ను చెల్లింపుదారులకు పెద్ద శతృవులని, ప్రభుత్వం రానున్న 25 సంవత్సరాల భారతదేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంటే.. కొన్ని రాజకీయ పార్టీలు దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పాడు. ప్రధానితో పాటు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు, ఆ పార్టీకి, నయా ఉదారవాద విధానాలకు మద్దతిస్తున్న మేధావులు కూడా ఈ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.
ఈ అంశాలు ప్రధాని స్వయంగా చెబుతున్నవి కావు. పలికెడిది భాగవతమట అని పోతన చెప్పిన చందంగా నయా ఉదారవాద విధానాలు అంతిమదశకు చేరుతున్న సమయంలో కార్పొరేట్‌, బహుళజాతి సంస్థల ప్రయోజనాలను కాపాడడానికి, హిందుత్వ విధానాలను మరింత ముందుకు తీసుకుపోవటానికి అవసరమైన ఈ విధానాలను ప్రపంచబ్యాంకు, ఆర్‌ఎస్‌ఎస్‌లు ముందుకు తెస్తున్నాయి. వాటినే ప్రధాని వల్లించాడు. తమ యజమానుల ప్రయోజనాలను నెరవేర్చటం కోసం ఆయన దేశప్రజలపై తీవ్రదాడి చేస్తున్నాడు. నయా-ఉదారవాద విధానం అంతిమదశకు చేరుతున్న సమయంలో..పాలకులు వారికి చేస్తున్న సేవలో భాగమే ఇవన్నీ.

  • ఉచితాలంటే ఏమిటి?

ఉచితాలపై ప్రధాని, ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నాయకుల దాడి, అది దేశప్రజలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలంటే ఉచితాలంటే ఏమిటో ముందు అర్థం చేసుకోవాలి. ప్రజలు తమకు అవసరమైన వాటిని పూర్తి వెల చెల్లించి పొందాలి. అలా కాకుండా ఉచితంగా పొందుతున్నవి మాత్రమే కాక, తక్కువధరలకు పొందుతున్న వాటిని కూడా ఉచితంగా పొందుతున్న వాటిగానే లెక్కించి, ధరలో చెల్లించని మొత్తాన్ని కూడా చెల్లించాలని కోరవచ్చు. ఆ విధంగా చూసినపుడు మార్కెట్‌ ధర అని చెబుతున్న దాని ప్రకారం కాకుండా అంతకు తక్కువగా ఏది పొందినా ఉచితం లెక్కలోనిదేనని ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా చూసినపుడు ఉచితాల జాబితాలోకి ఏవేవి వస్తాయో, ప్రజలకు లభిస్తున్న రాయితీలను పూర్తిగా రద్దు చేస్తే ప్రజలు ఏం కోల్పోతారో మనకు స్పష్టమౌతుంది.
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా దేశంలోని 30 కోట్ల కుటుంబాలకు ఆహారధాన్యాలను అందజేస్తున్నారు. వీటిని మార్కెట్‌ ధర కన్నా చాలా తక్కువ ధరకు పేదలు పొందుతున్నారు. సరుకుల ధరలో ప్రజలు పొందుతున్న రాయితీని రద్దుచేసి, మార్కెట్‌ ధరలకు బియ్యంతో పాటు నిత్యావసరాలన్నింటినీ కొనుగోలు చేయాలంటే ప్రతి పేద కుటుంబంపైనా ప్రతినెలా వేల రూపాయల భారం పడుతుంది. కోట్లాది మందికి వృద్ధాప్య పింఛన్లు అందుతున్నాయి. వీటిని ఉచితాలుగా పరిగణించి రద్దుచేస్తే వారు బతకలేని పరిస్థితులు వస్తాయి. పనిచేసినపుడు జీతం ఇచ్చారు, కాబట్టి రిటైరైన తర్వాత ఇచ్చేవి ఉచితాలవుతాయని చెప్పి ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చే పెన్షన్‌, పిఎఫ్‌ తదితరాలను రద్దు చేయటానికి అవకాశం ఉంది. ప్రభుత్వ విద్య, వైద్యం దాదాపుగా ఉచితంగానే అందుతున్నాయి. వీటిని పూర్తిగా రద్దు చేయటం లేదా ప్రైవేటు విద్య, వైద్యాలకు చెల్లించిన విధంగానే భారీ మొత్తాలను చెల్లించే విధానాన్ని అమలులోకి తెస్తారు. ప్రజలు తమ ఇంటినుండి బయటికి రావాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా రోడ్లు అవసరం. ఇంటిలో వివిధ సరుకులను వినియోగించటం వల్ల వచ్చిన చెత్తను పారబోయాలి. మురుగునీరు బయటకు పోవాలి. మంచినీటి సరఫరా, మురుగునీరు, చెత్తను పారబోయటం తదితరాలకు ఇప్పటికే ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇవి కూడా ఉచిత సేవల లెక్కలోకే వస్తాయి కాబట్టి వీటికోసం ప్రజలందరి నుండి డబ్బు వసూలు చేస్తారు. రైతులు పంటలు పండించటానికి విత్తనాలు, ఎరువులు కావాలి. పంటలకు మద్దతు ధరలు కావాలి. తక్కువ వడ్డీకి రుణాలు కావాలి. విత్తనాలు, ఎరువులపై రైతులకు ఇస్తున్న సబ్సిడీలను పూర్తిగా రద్దుచేస్తారు. వడ్డీ రాయితీ ప్రసక్తి ఉండదు. పంటలను అమ్ముకొనేటపుడు మార్కెట్‌లోవచ్చినదే తీసుకోవాలే కాని మద్దతు ధర గురించి ప్రస్తావించకూడదు. నిరుద్యోగులు నిరుద్యోగభృతి ఇవ్వాలని కోరటం కూడా ఉచితాల లెక్కలోకే వస్తుంది కాబట్టి అడగటమే తప్పయిపోతుంది. ప్రైవేటు వారు ప్రవేశించని విద్యుత్‌ సరఫరా, పంపిణీ, సాగునీరు, రైలు తదితర సేవలను రాయితీలపై ప్రభుత్వం నుండి ప్రజలందరూ పొందుతున్నారు. ఈ రంగాల్లోకి ప్రైవేటు వారిని తీసుకొచ్చి, వారు భారీగా ధరలు పెంచి దోచుకోవటానికి అవకాశం కల్పిస్తారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవటాన్ని ఇప్పటికే ప్రారంభించారు. డబ్బు చెల్లించి పొందుతున్న ప్రభుత్వసేవలు పోస్టల్‌, టెలిఫోన్‌, బస్సు, ఇతర సేవలకు ప్రైవేటు సంస్థలతో సమానంగా చెల్లించమని డిమాండ్‌ చేస్తారు. ్టవ్యవసాయ కార్మికులు భూములు పంచాలని, ఇళ్లు లేనివారు ఇళ్ల స్థలాలివ్వాలని కోరకూడదు. అవి భూమి, స్థలాలను ఉచితంగా పొందటానికి ప్రయత్నం చేయటమే అవుతుంది. ఉపాధి హామీ పనులు, వేతనాల పెంపు కోసం డిమాండ్‌ చేయడాన్ని కూడా ఈ లెక్కలోకే చేర్చి, అవి తప్పని చెప్పి, మొత్తం చట్టాన్నే రద్దుచేయవచ్చు. ఈ విధంగా దేశంలోని సామాన్యులు పొందుతున్న వాటన్నింటికీ ఉచితాలని ముద్రవేసి, మొత్తంగా అన్ని పథకాలు,పేదలు, శ్రామిక ప్రజలకు మేలు కలిగించే చట్టాలను రద్దుచేయటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దీనిని కప్పిపుచ్చుతూ... దీర్ఘకాలంలో ప్రయోజనాలు దక్కుతాయని, 25 సంవత్సరాల అభివృద్ధి అని సుద్దులు చెబుతున్నాడు. పంచవర్ష ప్రణాళికా విధానమే పనికిరానిదని రద్దు చేసిన వీరు 25 సంవత్సరాల అభివృద్ధి పథకం అని చెబితే నమ్మేటంత వెర్రివాళ్లా ప్రజలు !

  • ప్రభుత్వం కార్పొరేట్లకు దోచిపెట్టటం ఉచితాల లెక్కలోకి రాదా!

పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలపై తీవ్రమైన దాడిచేస్తున్న ప్రధాని మోడీి, ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నాయకులు కార్పొరేట్లు, బహుళజాతి సంస్థలకు దేశసంపదను అప్పనంగా కట్టబెడుతున్నారు. దీనిని గురించి మేధావులు, మీడియా ప్రస్తావించడం లేదు. కోట్లాది మంది పేదలు, ప్రజలకు అందుతున్న రాయితీలు ప్రభుత్వ భిక్షకాదు. శ్రమజీవులైన కార్మికులు-కర్షకులు, ఉద్యోగులు, ఇతర శ్రామికులు తమ శ్రమతో దేశసంపదను పెంచుతున్నారు. కోట్లాది మంది ప్రజల శ్రమ ద్వారా సృష్టించబడ్డ సంపద వారికే చేరాలని కోరటం అడ్డదారి ఎలా అవుతుంది? లక్షల కోట్ల రూపాయల రుణాల రద్దు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, ద్రవ్యీకరణ పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను, ప్రభుత్వ ఆదాయాన్ని కార్పొరేట్లు, సామ్రాజ్యవాదులకు అప్పగించటం అడ్డదారి, చీకటిదారి అవుతుంది. కళ్లుమూసుకుని పాలుతాగుతున్న పిల్లి తనను ఎవ్వరూ చూడటం లేదని భ్రమలో ఉన్నట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపిలు దేశ సంపదను కొల్లగొట్టటానికి, కార్పొరేట్‌, సామ్రాజ్యవాద శక్తులకు కట్టబెట్టటానికి పూనుకున్నారనే విషయాన్ని ప్రజలు గమనించటం లేదన్న భ్రమల్లో ఉన్నారు. ప్రజలు అన్నింటినీ, అందరినీ గమనిస్తున్నారు. తగిన సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపిలకు గుణపాఠం చెబుతారు.

kotireddy

 

 

- ఎ.కోటిరెడ్డి