May 11,2023 07:02

చదువంటే ఆమెకు ప్రాణం... కూతురు ఆసక్తిని గమనించిన తండ్రి రోజు కూలీగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ఆమె చదువుకు ఆటంకం కలిగించలేదు. పైగా ఎన్ని కష్టాలొచ్చినా చదువు ఆపొద్దని ఆమెకు చెప్పాడు. తన స్థోమతను బట్టి ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాడు. అయితేనేం ఆ చదువుల తల్లి సాధించిన ఘనత ఇప్పుడు దేశంలోనే ఆమె పేరు మార్మోగిపోయేలా చేసింది. తమిళనాడు దిండిగల్‌ జిల్లాకు చెందిన నందిని ఇటీవల 12వ తరగతి పరీక్షలు రాసింది. తాజాగా విడుదలైన ఫలితాల్లో 600 మార్కులకు 600 సాధించి రికార్డు సృష్టించింది. ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాల అన్నామలైర్‌ మిల్స్‌ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న నందిని తమిళం, ఇంగ్లీషు, ఎకనామిక్స్‌, కామర్స్‌, అకౌంట్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్‌ సబ్జెక్టులన్నింటిలో వందకు వంద మార్కులు సాధించింది.
'మా నాన్న కష్టమే నన్ను ఇంత పెద్ద విజయం సాధించేలా చేసింది. 'నా చదువే నా ఆస్తి' అని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. నా కలలను సాకారం చేసుకునేందుకు ఎంతో ప్రోత్సహించారు' అంటూ తండ్రి గురించి నందిని చెబుతున్నప్పుడు ఆమె కళ్లల్లో కన్నీటిపొరలు కనిపించాయి.
నందిని తండ్రి శరవణన్‌ కుమార్‌ రోజు కూలీకి వడ్రంగి పని చేస్తారు. తల్లి భానుప్రియ గృహిణి. తమ్ముడు నందిని చదువుతున్న స్కూల్లోనే ఆరో తరగతి చదువుతున్నాడు. 'నా కూతురు చిన్నతనం నుంచి చదువులో చురుకుగా ఉండేది. మేము ఎంత కష్టపడుతున్నామో రోజూ చూసేది. మా భారం తగ్గించాలని ఎప్పుడూ అనుకునేది. చదువు ద్వారా మా కష్టాలు తీరతాయని బలంగా నమ్మింది. నా బిడ్డకు నేను ఆస్తులు కూడగట్టలేదు. కాబట్టి చదువుకు ఆటంకం కలిగించకూడదనుకున్నాను. తను ఇంత ఘనత సాధిస్తుందని కలలో కూడా ఊహించలేదు' అంటూ ఆ తండ్రి కూతురు విజయం గురించి ఆనందంగా చెబుతున్నప్పుడు కంటినిండా నీళ్లతో మాటలు తడబడ్డాయి.
'నందిని ఈ ఘనత సాధిస్తుందని మేము ముందే ఊహించాం. గతేడాది 11వ తరగతి పరీక్షల్లో తనకు 600 మార్కులకు గాను 598 సాధించింది. కష్టపడి చదువుతుంది. చాలా తెలివిగలది. టీచర్ల ప్రోత్సాహంతో స్కూల్లో చెప్పిన పాఠాలు అభ్యసించే ఈ ఘనత సాధించింది. ట్యూషనుకు కూడా వెళ్లలేదు' అంటూ తమ విద్యార్థి సాధించిన ఘనతను చెబుతున్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయిని అఖిల.
'చదువంటే నాకు చాలా ఇష్టం. స్కూల్లో.. ఇంట్లో ఎలా చదువుకోవాలో స్వయంగా టైమ్‌టేబుల్‌ వేసుకునేదాన్ని. నా స్నేహితులు చాలాసార్లు బయటికి వెళదామని, సినిమా చూద్దామని పిలిచేవారు. కాని నేను వెళ్లేదాన్ని కాదు. క్లాసు రూంలో అర్థం కాని పాఠాలను చదువుకునేందుకు ఇంట్లో ఎక్కువ సమయం కేటాయించేదాన్ని. నా అభ్యాసం తెల్లవారుజాము నుండే ప్రారంభమయ్యేది' అని చెబుతున్న నందిని ఇంగ్లీషు, తమిళం రెండు మాధ్యమాల్లోనూ నైపుణ్యత ప్రదర్శించేది.
చదువులోనే కాదు సాహిత్యంలోనూ ప్రతిభ కనబరిచే నందిని ఇంగ్లీషు, తమిళంలో కవితలు, రచనలు చేసేది. సిఎ చదవాలని ఆశపడుతున్న నందినికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడుగా నిలిచింది. 'చదువే నా ఆస్తి' అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో అభినందించారు. తన చదువుకు తమ వంతు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. 'నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలం. ఎవరో వచ్చి మిమ్నల్ని ప్రోత్సహించనక్కర్లేదు. నేను అలాగే అనుకున్నాను. నా కాళ్లపై నిలబడాలనుకున్నాను. నా చదువు.. నా కల.. అది నెరవేరేలా చేసుకోవడం నా బాధ్యత..' అంటున్న నందిని మాటలు నేటి విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకం.

plus-1-topper-in-tamilnadu-nandini-jeevana