Jan 19,2023 06:57

మతములందలి అపవాదములను, మూఢనమ్మకాలను ఎత్తి చూపి నిజాన్ని మన ముందు ప్రతిబింబించిన హేతువాది, సామాజిక విప్లవకారుడు యోగి వేమన. పండిత లోకానికే పరిమితమైన వేదాంతాన్ని పామరులకు కూడా అర్థమయ్యేలా సరళమైన పదాలతో స్వచ్ఛమైన అచ్చమైన తేనె లాంటి తేట తెలుగు పద్యాలలో వివరించిన మహానుభావుడు వేమన.
సి.పి.బ్రౌన్‌ పరిశోధన ప్రకారం వేమన 1652వ సంవత్సరంలో కడప జిల్లా లోని ఒక చిన్న పల్లెలో జన్మించినట్లు తెలుస్తుంది. ఇప్పటికీ పండిత, పామర భేదం లేకుండా వేమన పద్యాలు వినని తెలుగు వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా ఆయన పద్యాలు జనబాహుళ్యం లోకి చొచ్చుకుపోయాయి. ఆయన రాసిన ప్రతి పద్యం ఒక ఆణిముత్యమే. మన వేమన...మంచి కోసం, మార్పు కోసం, మన కోసం ప్రశ్నించి, ప్రతిస్పందించి, ప్రతిధ్వనించాడు. వేమన పద్యాలు లోక నీతులు. సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం. వేమన స్పృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థ లోని లోటుపాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్తవ్యస్థత మీద వేమన తన పద్యాన్ని ఎక్కుపెట్టాడు.
అంతటి మహానుభావుడి పద్య చరితను మన తెలుగు వారికి అందజేసింది మాత్రం ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. 'హిందువుల ఆచారాలు
పండుగలు' అనే గ్రంథాన్ని చదువుతున్న సమయంలో కొన్ని వేమన పద్యాలు చదివి వాటికి ఆకర్షితుడయ్యాడు సి.పి. బ్రౌన్‌. ఆ ఆకర్షణ లోని తీక్షణతే వేలకొలది వేమన పద్యాలను సేకరించేలా చేసింది. వేమన వేదాంత విషయాలను చెప్పడానికి కందాలను, తేటగీతులను ఎక్కువగా ఎంచుకున్నాడు. ఆటవెలదులను ఎక్కువగా లోక సంబంధమైన పద్యాలకు ఎన్నుకొన్నాడు. వేమన చెప్పిన కంద, తేటగీతి పద్యాల భావములు మతవాదుల చట్రములలో ఇమడక పోవటం వల్ల, వాటి నిగూఢ భావములు వారికి అంతుచిక్కక పోవటం వల్ల, ఆ పద్యాలు వేమన చెప్పినవి కావని వారు భావిస్తున్నారు. కాని బ్రౌన్‌ వాటిని వున్నవున్నట్లు తన సంకలన గ్రంథంలో ప్రచురించాడు. వేమన పద్యాలు రెండవ ఎడిషను కూడా అచ్చు వేయించాడు. 1845లో మద్రాస్‌ లిటరసీ సొసైటీకి తన స్వంత ధనంతో సంపాదించిన 2440 రాతప్రతులను కానుకగా ఇచ్చాడు.
బ్రౌను దొర వేమన పద్యాలను ప్రచురించడమన్నది ఆ రోజుల్లో చాలామంది పండితులకు నచ్చక ఆయనను వ్యతిరేకించారు. అందుకుగల కారణం హిందూ మతంలోని లోపాలను ఎత్తిచూపడమే. సంఘసంస్కరణను కోరిన వేమనను గురించి మనం తప్పక స్మరించుకోవాలి.
వేమన కాలం, పుట్టిన ప్రదేశం గురించి పండితుల మధ్య తర్జన భర్జనలు నేటికీ జరుగుతున్నాయి. వేమన కాలం గురించీ, జీవితం గురించీ సి.పి. బ్రౌన్‌, తరువాత మరికొంతమంది అధ్యయనం చేశారు. వంగూరి సుబ్బారావు, వావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రి, బండారు తమ్మయ్య, ఆరుద్ర, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, వేమూరి విశ్వనాథ శర్మ, కొమర్రాజు వేంకట లక్ష్మణరావు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి వంటి పండితులు, పరిశోధకులు ఈ విషయంపై వివిధ అభిప్రాయాలు తెలిపారు. వారందరి పరిశోధనల తదుపరి ఆయన జీవిత కాలం గురించి గాని, జీవిత గాధ గురించి గాని ఏకాభిప్రాయం ఇప్పటివరకూ లభించలేదు. 1652-1730 మధ్య జీవించిన వేమనలా తెలుగువారి గుండెల్లో పలికిన ప్రజా కవి మరొకరు లేరనే చెప్పాలి. ఇన్నేళ్ళు గడిచినా మన నాలుకల మీద నాట్యమాడుతున్న మన వే''మన'' పద్యాలే అందుకు సాక్షి. విశ్వదాభిరామ వినురవేమ అనే మాట వినని, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి.
- రేగుళ్ళ మల్లికార్జున రావు,
భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు,
సెల్‌ : 9491659899