Jun 08,2023 16:57

ప్రజాశక్తి - యానాం : పుదుచ్చేరి మత్స్యశాఖ ద్వారా కొత్తగా  మంజూరైన వృద్దాప్య పెన్షన్లను యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పంపిణీ చేశారు. గురువారం స్థానిక మత్సశాఖ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొల్లపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యానాం మత్స్యకారులకు సంబంధించి 252 మందికి వృద్దాప్య పెన్షన్ల ధృవపత్రాలను ఎమ్మెల్యే గొల్లపల్లి, ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామిలు అంద చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి  తాను ఎప్పుడూ కృషి చేస్తానని తెలిపారు.ఎప్పటి నుంచో పెన్షన్లు మంజూరు కావడం లేదని, దరఖాస్తు చేసుకున్న చాలా మంది తన ధృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు.ఈ విషయంపై పలుమార్లు ముఖ్యమంత్రిని కోరడం జరిగిందని, తాను ధీక్ష చేసినప్పుడు కూడా పెన్షన్లు కోసం గట్టిగా డిమాండ్ చేసినట్టు తెలిపారు.ఈమేరకు ప్రభుత్వం స్పందించి  సాంఘీక సంక్షేమ శాఖ ద్వారా సుమారు 550 మందికి పెన్షన్లు మంజూరు కాగా ప్రస్థుతం మత్స్యశాఖ ద్వారా 252 మందికి ఒకేసారి మంజూరు అయినట్టు తెలిపారు. త్వరలో ఓఎన్జీసి పరిహారం కూడా మంజూరు అవుతుందని, పరిహారం లబ్దిదారుల బ్యాంకు ఖాతాలోనే జమ చేయడం జరుగుతుందని తెలిపారు. అయితే పరిహారంకు  సంబంధించి ఎవరికీ ఒక్క పైసా కూడా ఎవరూ ఇవ్వవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి మునుస్వామి,  మత్స్యశాఖ అధికారి గొంతియ్య మాట్లాడారు.సభకు ముందుగా ఎమ్మెల్యేను గొంతియ్య శాలువాతో సత్కరించారు.