Mar 26,2023 07:26

రామకృష్ణయ్య సుశీలమ్మ దంపతులకు నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ప్రైవేటు టీచర్‌గా పిల్లలకు ట్యూషన్లు చెబుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఊరిలో అందరికీ తలలో నాలుకలా మసలుకునేవాడు. కానీ రామకృష్ణయ్యకు వచ్చే డబ్బులు కుటుంబాన్ని నడపడానికి ఎంతమాత్రం సరిపోయేవి కావు. సుశీలమ్మ బీడీలు చుడుతూ, వేడినీళ్లకు చన్నీళ్ల మాదిరి భర్తకు సాయపడేది. తన పిల్లల్ని మాత్రం చక్కగా చదివించేవాడు. వారిని గొప్పగా చూడాలని రామకృష్ణయ్య కల. చదువులో మాత్రం అందరూ బాగా చదివేవారు.
కొన్నిరోజుల తర్వాత రామకృష్ణయ్య ఆరోగ్యం ఎంతమాత్రం సహకరించ లేదు. అనారోగ్యంతో మంచాన పడ్డాడు. వెంటనే పట్నంలో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని, లక్షల డబ్బులు ఖర్చు పెడితేనే బతుకుతాడని డాక్టర్లు చెప్పారు. పాపం ఆ కుటుంబానిది దిక్కుతోచని పరిస్థితి. తండ్రి పరిస్థితి చూసి పెద్దకొడుకు స్వామి తల్లడిల్లిపోతాడు. తన తండ్రిని బతికించుకోవాలని ఏదో ఒకటి చేయాలని, డబ్బులు సమకూర్చుకోవాలని, తండ్రి ఆరోగ్యానికి మంచి వైద్యం అందించాలని మనసులో అనుకున్నాడు. ఆ రోజు రాత్రి అంతా బాగా ఆలోచించాడు.
తెల్లవారి ఊరిలో తనకు తెలిసిన దుబ్బయ్య శెట్టి దగ్గరికి వెళ్లి అతని కాళ్ల మీదపడి తనకు వెంటనే రెండు లక్షలు కావాలని తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని తన బాధను ఏకరువుపెట్టాడు. మీ కొట్లో నేను పనిచేసి మొత్తం రెండు లక్షలు తీర్చేస్తానని మాట ఇచ్చాడు. పాపం శెట్టి గారు చలించిపోయి రెండు లక్షల రూపాయలు వెంటనే ఇచ్చేశాడు. శెట్టి సహాయానికి కృతజ్ఞత తెలిపి, స్వామి తన తండ్రి వైద్య సేవలకు పట్నానికి వెళ్లి బాగు చేయించాడు. పరిస్థితి విషమించి, రామకృష్ణయ్య తుది శ్వాస విడుస్తాడు. ఇది ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగులుస్తుంది.
భర్త మరణించాక సుశీలమ్మ తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, తన పెద్దకొడుకు స్వామికి వివాహం చేయాలనుకుంటుంది. కానీ అందుకు స్వామి నిరాకరిస్తాడు. తమ్ముళ్లను, చెల్లెలను చదివించి, వారు స్థిరపడ్డాకే తాను వివాహం చేసుకుంటానని అంటాడు. కొడుకు నిర్ణయానికి ఆశ్చర్యపోతుంది సుశీలమ్మ.
స్వామి చదువు మానేసి దుబ్బయ్య శెట్టి కొట్టులో పనికి కుదురుతాడు. రాత్రింబవళ్లు కష్టపడి అనతికాలంలోనే అప్పు తీర్చేశాడు. అంతేకాకుండా తండ్రి కోరిక మేరకు తమ్ముళ్లకు, చెల్లెళ్లకు మంచి చదువు చెప్పించి, వారిని మంచి స్థాయిలోకి తీసుకొస్తాడు. అంతేకాకుండా మంచి సంబంధాలు చూసి వివాహం జరిపిస్తాడు. ఇది చూసిన తల్లి సుశీలమ్మ ఆనంద భాష్పాలు కారుస్తుంది.
ఇంటికి పెద్దన్నయ్యగా తండ్రి బాధ్యతలన్నీ తీర్చేస్తాడు. ఇప్పుడు తల్లి సుశీలమ్మ 'నాయనా నువ్వు అనుకున్న ప్రకారం తమ్ముళ్లు, చెల్లెళ్లు స్థిరపడ్డారు. నువ్వు కూడా చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో!' అంటుంది. దగ్గరి బంధువుల అమ్మాయిని చూసి వివాహం చేసుకొని ఇంటికి పెద్దన్నయ్యగా, తమ్ముళ్లను చెల్లెళ్లను ప్రేమగా చూసుకుంటూ జీవితాన్ని గడుపుతాడు స్వామి.

యాడవరం చంద్రకాంత్‌ గౌడ్‌
94417 62105