
ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం శుక్రవారం జరిగింది. శనివారం గుంటూర్లో నిర్వహించనున్న శాంతియుత ర్యాలీపై సమీక్ష నిర్వహణపై నేతలు చర్చించారు. శాంతియుత ర్యాలీకి అన్నీ మిత్రపక్షాలు, ప్రజా సంఘాలు కలసిరావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు లాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని అరెస్ట్ చేయడం హైయమైన చర్యగా అభివర్ణించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టడానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ శాంతియుత ర్యాలీకి జనసేన పార్టీ తమ సంఘీభావాన్ని ప్రకటించిందన్నారు. గుంటూరు లాడ్జి కూడలి నుంచి మార్కెట్ కూడలి గాంధీ విగ్రహం వరకు ధర్మాగ్రహ శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. జనసేన, టీడీపీ, సీపీఐ, మిత్రపక్షాలు కలుపుకొని ర్యాలీ జరుగుతుందన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, రాజ్యాంగాన్ని ఖునీ చేసిన వైసీపీ ప్రభుత్వం పై ప్రత్యేక పోరాటం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు, మిత్రపక్షాలు కూడా కలసి పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 30 యాక్ట్ అమలులో ఉందని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు తీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో ప్రజాగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరించారు. రేపు జరిగే శాంతియుత ర్యాలీకి సహకరించాలని ప్రతిఒక్కరిని కోరారు.