ఘనంగా జరుపుకొనే పండుగలన్నింటికి
గ్రహణమేదో పట్టింది
బంధాలు బంధుత్వాలను దూరం చేసి
అర్థం కాని ప్రశ్నలేవో కురిపిస్తుంది
కాలం పెను భూతమై, భయపెట్టిస్తోంది
నోటికాడి కూడును దూరం చేస్తుంది
అందమైన తరువుకు విరబూస్తున్న
పూలన్నీ నేల రాలుతున్నాయి
అంతుపట్టని రోగమొకటి
స్మశానపు వైపు దారిచూపుతూ
ఈ సమయం, ఇపుడు నడిచే కాలం
నాదేనని విర్రవీగుతుంది
ఎదలో అగ్నిగుండాలు దారా వాహమై
ఎగసి పడుతున్నాయి
మంటల తాకిడికి, బతుకులన్ని
మసి బారి పోతున్నాయి
చీకటి తెరలన్నీ తొలగిపోయి
వెన్నెల వెల్లువలు వచ్చే
రోజులెప్పుడో
ఆశ అనే పల్లకిలో ఊరేగుతున్న
ఈ ప్రయాణానికి
గుణపంతో గుండెలపై గుచ్చుతున్న
ఈ మాయదారి రోగం
మాయని గాయాలను మిగుల్చుతుంది
విష వాయువు ఆయువును తగ్గిస్తుంది.
చిగురిస్తున్న కొమ్మలను చిదిమేస్తుంది
- అశోక్ గోనె
9441317361