Aug 14,2022 13:42

సిమెంటు దిమ్మెలపై రెపరెపలాడే త్రివర్ణ పతాకాలు
చొక్కాజేబులకు గుచ్చే మూడురంగుల బొత్తాలు
మొక్కుబడిగా సాగిపోయే జెండా వందనాలు
పొడిగొంతులతో మాత్రమే పాడే దేశభక్తి గేయాలు
అర్ధశతాబ్దం నాటి అవే ఊకదంపుడు ఉపన్యాసాలు
ఇవేనా మన తిరుగులేని దేశభక్తిని నిరూపించుకునే ప్రయత్నాలు

నిన్నటి దాకా అందరికోసం నిలబడిన నాలుగు సింహాలు
నేడు కార్పొరేట్ల కాళ్ల దగ్గర కాపలాకుక్కలై మొరుగుతున్నాయి
నిన్నటి దాకా అందరి పక్షాన నిలబడిన నాలుగు స్తంభాలు
నేడు కొందరి సింహాసనాలకు మూలస్తంభాలవుతున్నాయి
స్వార్థమేవ జయతే అంటూ వెనక్కి తిరుగుతోంది ధర్మచక్రం
ఇవేనా మన జాతిని జాగృతం చేసే నిజ శాశ్వత చిహ్నాలు

ఆకాశాన్నంటే ధరలకు గుర్తుగా జయకేతనాలు ఎగరేయాలా
దేశసంపదను అంగట్లో అమ్ముతున్నందుకు సంబరాలు చేయాలా
పేదోడి తిండి మీద పన్నులేస్తున్నందుకు పండగలు చేసుకోవాలా
ప్రశ్నించే గొంతులను పరిమారుస్తున్నందుకు జేజేలు కొట్టాలా
జాతీయవాదం మత్తులో జనాన్ని జోకొట్టడమేనా నిజమైన
స్వాతంత్య్రం అంటే..
ఒకే దేశం అంటూనే నాటుతున్నారు మతాల ముళ్లకంచెలు
ఒకే జాతి అంటూనే కడుతున్నారు కులాల ప్రహరీగోడలు
ఒకే గొంతు అంటూనే అల్లుతున్నారు భాషాభేథాల ఉరితాళ్లు

అందరంకలసి జీవిస్తున్నా కొందరిపై నిత్యం సాగే అవహేళనలు
అవమానాలు అనుమానాలతో కొనసాగే శాశ్వత శతృత్వాలు
ఇవేనా మనం జరుపుకుంటోన్న వైషమ్యాల అమృతోత్సవాలు

శ్రీనివాసరెడ్డి
78931 11985