
దేశభక్తిపై తమకే పేటెంట్ హక్కు ఉన్నదని చెబుతూ జాతీయత పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న బిజెపి ప్రభుత్వం అగ్నిపథ్ ద్వారా దేశానికి చేస్తున్న నష్టం మాటల్లో చెప్పలేం. ఇప్పటికే రక్షణ పరిశ్రమలన్నింటినీ ప్రయివేటుపరం చేసి, మన సైన్యానికి అవసరమైన ఆయుధాలన్నింటినీ బహుళజాతి కంపెనీల చేత తయారు చేయించి వారి వద్ద కొనుగోలు చేసేందుకు బిజెపి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. ఇప్పుడు ఈ కాంట్రాక్టు సైనికుల్ని కూడా కలిపితే బహుళజాతి కంపెనీలు దేశ భద్రతను తమ గుప్పెట్లో పెట్టుకుంటాయనడంలో సందేహమే లేదు.
ప్రధానమంత్రి ఆమోదంతో రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యం భర్తీకి ఒక కొత్త పథకాన్ని ప్రకటించారు. అగ్నిపథం పేరుతో ప్రకటించిన ఈ పథకంలో సైన్యం భర్తీకి సంబంధించి రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ కాకుండా నాలుగు సంవత్సరాల కాలపరిమితితో ఉద్యోగం ఉండేలా నిబంధన పెట్టారు. 17-21 సంవత్సరాల మధ్యలో యువతను పదో తరగతి కనీస అర్హతగా తీసుకుని ఆన్‌లైన్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేస్తారు. శిక్షణ తరువాత నాలుగు సంవత్సరాల కాలం వీరు సైనికులుగా ఉంటారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో వీరి జీతం నుంచి 10 శాతం కోత విధించి ఆ డబ్బును ప్రత్యేక ప్రభుత్వ నిధిలో జమ చేస్తారు. నాలుగు సంవత్సరాల తర్వాత వీరిలో 25 శాతాన్ని రెగ్యులర్ సైనికులుగా నియమించుకుని మిగతా వారందర్నీ సైన్యం నుండి తొలగిస్తారు. వీళ్ళ జీతంలో మినహాయించుకున్న మొత్తానికి తోడుగా అంతే ప్రభుత్వ మొత్తాన్ని జత చేసి వీరిని ఇంటికి పంపుతారు. మొదటి సంవత్సరం నుండి వీరి జీతం నుండి మినహాయించుకున్న డబ్బుకు వడ్డీలు కలుపుతూ పోతే చివర్లో ప్రభుత్వం ఇచ్చేది నామమాత్రమే. ఇక పెన్షన్ తదితర ఎలాంటి సౌకర్యాలు వీరికి ఉండవు. ఇది నిలువు దోపిడీ కంటే అన్యాయమైన దోపిడీ కాదా ?
నిండు యవ్వనంలో ఉద్యోగాలు కోల్పోయి లక్షల సంఖ్యలో బైటకు వచ్చే ఈ యువతకు భవిష్యత్తు ఏమిటి? అన్న ప్రశ్నకు ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నది. చదువును కొనసాగించుకోవచ్చునని, తాము సైన్యం నుండి బైటకు పంపుతున్న సందర్భంలో అగ్నివీర సర్టిఫికెట్లు ఇస్తామని వీటితో ఎక్కడైనా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చునని అదీ కాకుంటే బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధి చేసుకోవడానికి తగిన ఆర్థిక సహకారాన్ని అప్పు రూపంలో అందేలా చూస్తామని చెబుతున్నారు. ఇప్పటికే దేశంలో చాలా గరిష్ట స్థాయిలో నిరుద్యోగం ఉన్నది. అగ్నివీర కాగితం చూపించిన వెంటనే ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు. స్వయం ఉపాధి అన్నది మిధ్యా ప్రపంచం. వీరు పొదుపు చేసుకున్న డబ్బును పోగొట్టుకోడానికే ఉపయోగపడుతుంది. ఇంగిత జ్ఞానం కూడా లేకుండా యువతను భ్రమల్లో పెట్టే ఈ పథకాన్ని ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేయాలని చూస్తున్నది.
సైన్యంలో గత రెండు సంవత్సరాలుగా రిక్రూట్‌మెంట్ లేనందు వల్ల శిక్షణా సంస్థల ద్వారా తర్ఫీదు పొందిన లక్షల మంది నిరుద్యోగులు సైన్యం రిక్రూట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అనేకసార్లు తేదీలను ప్రకటించి ఆ తర్వాత రద్దు చేశారు. ఎప్పుడెప్పుడా అని భర్తీ కోసం ఎదురు చూస్తున్న యువత ఆశలపై నీళ్ళు చల్లుతూ ఈ కొత్త కాంట్రాక్టు సైనిక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఆవేశానికి లోనైన యువత దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లు లక్ష్యంగా జరుగుతున్న ఈ ఆందోళనల్లో అనేక రైళ్ళు, బోగీలు ఆగ్రహ జ్వాలల్లో దగ్ధమయ్యాయి. అనేక రాష్ట్రాల్లో రైళ్ళు రద్దయ్యాయి. లాఠీ చార్జీలు, బాష్పవాయు ప్రయోగాలు, పోలీసుల కాల్పులు కూడా లెక్కచేయకుండా యువత పోరాడటానికి...వారి ఆశలపై నీళ్ళు చల్లిన కేంద్ర ప్రభుత్వమే కారణం.
అగ్నిపథ్ పథకం ద్వారా భర్తీ అయినటువంటి యువకులు 21-25 సంవత్సరాల మధ్యలో సైన్యం నుండి బయటకు వస్తారు. సాయుధ శిక్షణ పొందిన లక్షల సంఖ్యలో యువత నిరుద్యోగులుగా సమాజంలో మిగిలిపోతే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారితే దాని ప్రభావం సమాజం మీద ఏ రకంగా ఉంటుందో బిజెపి ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? లేదా? ఇంత పెద్ద సంఖ్యలో సాయుధ శిక్షణ పొందిన యువకులు భావావేశాలకు లోనైతే సమాజంలో ఎలాంటి ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉందో ప్రభుత్వం ఆలోచించిందా? ప్రపంచంలో యువత ఆయుధాలు తీసుకున్న ప్రతి దేశం దీర్ఘకాలం అశాంతితో, హింసతో, దౌర్జన్యాలతో మునిగిపోయిందని అనుభవం చెబుతున్నది. మన దేశంలో ఖలిస్థాన్, శ్రీలంకలో ఎల్‌టిటిఇ, ఆప్ఘనిస్థాన్‌లో తాలిబాన్, ఐసిస్ లాంటి అనుభవాల్ని ప్రభుత్వం అధ్యయనం చేసిందా? లేదా? వీటన్నింటినీ పరిశీలించి జాగ్రత్తగా విధానాలు రూపొందించాల్సిన కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా ఇటువంటి తొందరపాటు పథకాలు ప్రవేశ పెడుతుందని విమర్శించడం తప్పెలా అవుతుంది? గతంలో భూస్వాముల ప్రయివేటు ఆర్మీ గురించి మనం విన్నాం. ఈ అగ్నిపథ్ ద్వారా రాబోయే కాలంలో ప్రయివేటు మిల్షియా ఏర్పడి కార్పొరేట్ల కనుసన్నల్లో ప్రజలపై దాడి చేయదనే గ్యారంటీ లేదు. లేదా సంఫ్‌ుపరివార్ శక్తులే ఇటువంటి సాయుధ శిక్షణ పొందిన నిరుద్యోగ యువతను చేరదీసి మరో తాలిబాన్ లాగా వ్యవహరించదనే గ్యారంటీ లేదు.
దేశం కోసం, సరిహద్దు రక్షణ కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి పని చేసే ప్రతి సైనికునికి తమ కుటుంబం పట్ల, తమ పిల్లల పట్ల...తన దేశం, తన సమాజం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని, వారిని కాపాడుతుందని నమ్మకం కల్గించాలి. అప్పుడే అతను దేశం కోసం అంకిత భావంతో అన్ని త్యాగాలకు సిద్ధపడి పోరాడగలుగుతాడు. నేడు అగ్నిపథ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అటువంటి భరోసా కల్గించలేదు. నాలుగు సంవత్సరాల తరువాత ఈ ఉద్యోగం ఉండదు. తనకేదైనా జరిగితే తన కుటుంబానికి రక్షణ ఉండదనే భావన కలిగిన కాంట్రాక్టు సైనికుల మీద దేశ రక్షణ ఆధారపడడం దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దేశభక్తిపై తమకే పేటెంట్ హక్కు ఉన్నదని చెబుతూ జాతీయత పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న బిజెపి ప్రభుత్వం అగ్నిపథ్ ద్వారా దేశానికి చేస్తున్న నష్టం మాటల్లో చెప్పలేం. ఇప్పటికే రక్షణ పరిశ్రమలన్నింటినీ ప్రయివేటుపరం చేసి, మన సైన్యానికి అవసరమైన ఆయుధాలన్నింటినీ బహుళజాతి కంపెనీల చేత తయారు చేయించి వారి వద్ద కొనుగోలు చేసేందుకు బిజెపి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. ఇప్పుడు ఈ కాంట్రాక్టు సైనికుల్ని కూడా కలిపితే బహుళజాతి కంపెనీలు దేశ భద్రతను తమ గుప్పెట్లో పెట్టుకుంటాయనడంలో సందేహమే లేదు. బిజెపి దేశభక్తి ఓట్ల భక్తి తప్ప దేశం పట్ల నిజమైన దేశభక్తి కాదని రుజువవుతున్నది.
ఈ దేశ భద్రతపై శాంతియుత వాతావరణంలో ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందాలని ఏమాత్రం ఉన్నా...నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణం ఈ అగ్నిపథ్ ప్రటకనను వాపస్ తీసుకోవాలి. సైన్యం లోని ఖాళీలన్నింటినీ భర్తీ చేసేలా తక్షణం రెగ్యులర్ రిక్రూట్‌మెంటుకు తేదీలు ప్రకటించాలి. సైనికులకు ఆత్మవిశ్వాసం కల్గించి అంకిత భావంతో దేశ రక్షణకు సేవచేసేలా చూడాలి. అలా కాకుండా ఏకపక్షంగా తాము చెప్పింది చేసి తీరతామని మొండికేస్తే...ఈ దేశానికి అగ్నిపథ్ ఒక వినాశన పథ్‌గా మారుతుందని హెచ్చరించడం మన బాధ్యత.
/ వ్యాసకర్త : సిపిఐ(యం) కేంద్ర కమిటీ సభ్యులు /
యం.ఏ. గఫూర్