Dec 10,2022 06:54

ప్రముఖ యోగా గురు రాందేవ్‌ బాబా నేతృత్వంలో నిర్వహించబడుతున్న ''పతంజలి ఆయుర్వేద సంస్ధ'' మన దేశంలో పలు రకాల వ్యాధులకు ఔషధాలను విక్రయిస్తున్నది. బి.పి, షుగర్‌, ఆస్తమా, గుండె జబ్బులు, పక్షవాతం, ఊబకాయం, కేన్సర్‌ వంటి సాంక్రమికేతర, జీవనశైలి సంబంధిత వ్యాధులకే గాక, సాంక్రమిక వ్యాధులైన మలేరియా, టైఫాయిడ్‌, చికున్‌గున్యా, డెంగ్యూ, కరోనా వంటి వైరల్‌ వ్యాధులతో సహా పలురకాల వ్యాధులకు సైడ్‌-ఎఫెక్ట్స్‌ లేని సహజసిద్ధమైన విధానంతో చికిత్స పేరిట విస్తృతంగా పతంజలి మందులు చలామణీలో ఉన్నాయి. పతంజలి యోగ్‌ పీఠ్‌ ట్రస్ట్‌కు చెందిన దివ్య ఫార్మసి ఇలాంటి మందుల విక్రయం ద్వారా 2020-21 సంవత్సరంలో అక్షరాలా రూ. 9783 కోట్లు టర్నోవర్‌ చేసింది.

మందుల విక్రయంతో పాటుగా పతంజలి ఫుడ్స్‌ పేరిట నడుస్తున్న ఆహార మరియు కాస్మొటిక్‌ ఉత్పత్తులు కూడా భారీగా టర్నోవర్‌ సాధిస్తున్నాయి. ఆవు నెయ్యి (రూ. 1467 కోట్లు), కేశ్‌ కాంతి షాంపు (రూ. 825 కోట్లు), దంత్‌ కాంతి టూత్‌ పేస్ట్‌ (రూ. 940 కోట్లు), సబ్బు (రూ. 574 కోట్లు) ...ఇంకా తేనె, బిస్కట్లు, జామ్‌, కెచప్‌, డ్రై ఫ్రూట్స్‌, గోధుమపిండి, పప్పుధాన్యాలు, తల నూనె, ఫేస్‌ వాష్‌, అలోవేరా జెల్‌, అగర్బత్తి, ధూపాలు..వంటి ఉత్పత్తులను కల్గిన ఎఫ్‌.ఎమ్‌.సి.జి (ఫాస్ట్‌ మూవింగ్‌ కన్‌జూమర్‌ గూడ్స్‌) బిజినెస్‌ సెక్టార్‌లో అతిపెద్ద దిగ్గజంగా ఎదిగింది. పతంజలి మందుల పరిశ్రమతో పాటు ఇవన్నీ కలిపితే సుమారు 30 వేల కోట్లకు పైగా టర్నోవర్‌ చేస్తున్నట్లు ఆ సంస్ధ విడుదల చేసిన లెక్కల ద్వారానే తెలుస్తోంది. కోట్ల మంది ప్రాణాలను బలిగొన్న కరోనాను కూడా మూడు రోజుల్లో నియంత్రించ వచ్చుననే ప్రచారంతో ''కరోనిల్‌'' మాత్రలను కరోనా సమయంలో పెద్ద ఎత్తున విక్రయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాస్త్రీయత ఉన్నా లేకున్నా, అత్యంత చాకచక్యంగా, దూకుడుగా ప్రజాకర్షక క్యాప్షన్లతో కూడిన ప్రకటనల ద్వారా రాందేవ్‌ బాబా తన వ్యాపారాన్ని విస్తరిస్తు న్నారు. తాజాగా కొద్ది సంవత్సరాల నుండి అల్లోపతి వైద్యం పైన అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తూ, అశాస్త్రీయ అంశాలతో ప్రకటనలు విడుదల చేస్తూ వివాదాలకు గురవుతున్నారు. కరోనా నేపథ్యంలో కూడా ''కరోనిల్‌'' మాత్రల అమ్మకం కోసం కరోనాకు అల్లోపతి వైద్యం వేస్ట్‌ అనీ, స్టుపిడ్‌ సైన్స్‌ అనీ అవాకులు చెవాకులు పేలారు. అనేకసార్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసి యేషన్‌ (ఐ.ఎం.ఏ) జాతీయ సభ్యులు, పలువురు వైద్య నిపుణులు కూడా రాందేవ్‌ బాబా వ్యాఖ్యలనూ, ప్రకటనలనూ ఖండించారు. అయినప్పటికీ రాందేవ్‌ బాబా తన వ్యాపార ఎత్తుగడల్లో భాగంగా అల్లోపతి వైద్యంపై కువిమర్శలతో దాడి చేస్తూనే ఉన్నారు.

కొద్ది నెలల ముందు ''పతంజలి వెల్‌నెస్‌'' పేరిట ప్రముఖ జాతీయ స్ధాయి ఇంగ్లీషు పత్రికలలో సగంపేజీ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో పతంజలి మందులతో అనేక వ్యాధుల్ని నయం చేస్తామనీ, మొత్తానికే మందులు అవసరం లేకుండా వ్యాధిరహితంగా చేస్తామనీ పేర్కొంటూనే ఆయా వ్యాధులకు అల్లోపతి మందుల ద్వారా చికిత్స జరగకపోగా, అనేక నష్టాలు వాటిల్లుతున్నట్లు ప్రతి వ్యాధికి సంబంధించిన సమాచారంలో పేర్కొనడం జరిగింది.

ప్రజలలో అతి సాధారణంగా కనబడే బి.పి, షుగర్‌, ధైరాయిడ్‌, కన్ను, చెవి సంబధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, కీళ్ల వ్యాధులు, ఆస్తమా, సంతాన సాఫల్యత, మానసిక వ్యాధులు తదితర వ్యాధులన్నిటినీ పతంజలి వైద్యం ద్వారా నయం అవుతాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పైగా ఆ ప్రకటనకు ''అల్లోపతి ప్రచారం చేస్తున్న అపోహలు'' అని హెడ్డింగ్‌ పెట్టారు.

ప్రజలను గందరగోళపరచే ఇటువంటి ప్రకటనల నేపథ్యంలో అల్లోపతి లేదా ఇతర వైద్య విధానాల ఉపయోగాలు, పరిమితుల గురించి కొన్ని అంశాలు పరిశీలించాల్సి వుంది. ఏ వైద్య విధానం కూడా పరిపూర్ణంగానూ, లోపభూయిష్టంగానూ ఉండదు. అల్లోపతి వైద్యవిధానంలో కూడా కొన్ని మందులకు సైడ్‌-ఎఫెక్ట్స్‌ ఉంటాయి. సాధారణంగా అల్లోపతి వైద్య విధానంలో ఏవైనా వ్యాధులకు చికిత్సగా పేర్కొనబడే ఔషధాలను ప్రజలు వాడేందుకు అనుమతించాలంటే కనీసం మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ (పోస్ట్‌ మార్కెటింగ్‌ దశతో కలిపి నాలుగు దశలు) జరిపి ఆ అధ్యయనాల ఫలితాల్ని ఔషధ నియంత్రణ అధారిటీకి సమర్పించాల్సి వుంటుంది. అవి పరిశీలన జరిగి, అధికారికంగా అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఆ మందులు పబ్లిక్‌ మార్కెట్లోకి విడుదల చేయాల్సి వుంటుంది. ఉదాహరణకు కోట్లాదిమంది ప్రాణాలను కాపాడిన యాంటిబయాటిక్స్‌, ఇన్సులిన్‌, యాంటి-మలేరియల్స్‌, క్షయవ్యాధి మందులు, వ్యాధినిరోధక వ్యాక్సిన్లు, శస్త్రచికిత్సలు వంటివి అల్లోపతి ఆవిష్కరణలే అన్నవిషయం ఎవరూ కాదనలేనిది. అంతెందుకు. సాక్షాత్తూ పతంజలి సంస్ధలో మరో కీలక భాగస్వామి, రాందేవ్‌ బాబా అనుంగు మిత్రుడైన ఆచార్య బాలకృష్ణ 2019లో ఫుడ్‌ పాయిజనింగ్‌ బారిన పడితే ఎయిమ్స్‌ (ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)లో చేరి చికిత్స పొందిన విషయం అందరికీ తెలిసిందే. కానీ కొన్ని దీర్ఘకాల వ్యాధుల చికిత్సలో అల్లోపతి వైద్యానికి ఉన్న పరిమితులు లేదా కొన్ని అల్లోపతి మందులకు ఉండే సైడ్‌-ఎఫెక్ట్స్‌ పట్ల ప్రజలలో ఉన్న భయాలనూ, సందేహాలనూ ఆసరాగా చేసుకుని అసంబద్ధమైన వ్యాఖ్యలతో ప్రకటనలు చేసి తమ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ చేసుకోవడం గర్హనీయం. బి.పి, షుగర్‌, సంతాన సాఫల్యత వంటి వ్యాధులకు మందు గోళీల నుండి మొదలుకుని ఆవు నెయ్యి, తేనె, గోధుమ పిండి, సబ్బు బిళ్ల, టూత్‌ పేస్ట్‌, ఫేస్‌వాష్‌ వంటి గృహావసర, సౌందర్యోత్పత్తుల దాకా వేలాది కోట్ల రూపాయల టర్నోవర్‌ చేసుకుంటున్న పతంజలి వ్యాపార సామ్రాజ్య మనుగడ వెనుక ప్రభుత్వాల, అధికారుల రాజకీయ, ఆర్థిక స్వార్ధ ప్రయోజనాలు వున్నాయనేది దాగని సత్యం. ప్రజల ప్రాణాలతో చెలగాటమా డుతున్న ఇలాంటి అశాస్త్రీయ ఆరోగ్య వ్యాపార ప్రకటనల్ని ప్రజలు, మేధావులు, వైద్య నిపుణులు, ప్రజారోగ్య శ్రేయోభిలా షులు పెద్ద ఎత్తున నిరసించాలి. ప్రభుత్వాలు స్పందించి 'డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ చట్టం-1940 మరియు డ్రగ్స్‌ అండ్‌ మేజిక్‌ రెమెడీస్‌ చట్టం-1954 కింద ఇటువంటి ప్రకటనలపై చర్య తీసుకుని ప్రజల హక్కుల్ని, ఆరోగ్య వ్యవస్ధనూ కాపాడాలి.

advertisement

 

 

 

వ్యాసకర్త : డా|| కె. శివబాబు, జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు,

సంగారెడ్డి జిల్లా