కె.కోటపాడు : ప్రయివేటు పాఠశాలలకు ప్రభుత్వ అనుమతి విధానాన్ని 10 ఏళ్ల కాలపరిమితినే కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రయివేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (అపుస్మా) రాష్ట్ర చీఫ్ మెంటార్ ఎ.కృష్ణారెడ్డి కోరారు. విశాఖపట్నం జిల్లా కె.కోటపాడు అయ్యన్న విద్యాసంస్థలలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయివేట్ స్కూళ్ళకు అనుమతి మంజూరుకాలాన్ని పదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించడం దారుణమన్నారు. ప్రయివేటు పాఠశాలలో చదివిన విద్యార్థులకు టీసీలు లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకోవడం వల్ల ఫీజులు బకాయిలు వసూలు కావడంలేదని, ప్రయివేటు యాజమాన్యాలు ఆర్థికంగా భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన చెందారు. బడ్జెట్ పాఠశాలలు, కార్పొరేట్ స్కూళ్లు, ఇండిపెండెంట్ స్కూళ్లుగా విభజించాలని కోరారు. ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాల పట్ల ప్రభుత్వ వివక్ష ఇలాగే కొనసాగితే రైతుల వలే తమకు కూడా ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో 'అపుస్మా' జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కోశాధికారి ఎంవి.రావు, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్కే.ఖాసీమ్, ఎంవివి.సత్యనారాయణ, దినేష్ పాల్గొన్నారు.










